టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆవిర్భవించి.. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి..

Update: 2022-04-27 06:21 GMT

హైదరాబాద్ : మాదాపుర్ లోని హెచ్ఐసీసీలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ ఆవిర్భావ వేడుక సందర్భంగా.. మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. ''2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆవిర్భవించి.. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి.. స్వరాష్ట్రంలో‌ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ.. కోట్లాది ప్రజల మద్దతు, కార్యకర్తల బలంతో టీఆర్ఎస్ పార్టీ సగర్వంగా 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశ విదేశాల్లోని 'గులాబీ' అభిమానులకు.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ ప్రజల గుండెల నిండా... గులాబీ జెండా'' అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

అలాగే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 2001 నుంచి నేటి వరకూ.. 22 ఏళ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. ఉద్యమ ఆంకాంక్షలైన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందన్న ఇంద్రకరణ్.. మంత్రి కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టిఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నిండిందన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా ప్ర‌త్యేక‌ రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందు అడుగు వేశారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ అంశాన్ని జాతీయ రాజకీయ ఎజెండాలో చేర్చి, రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించార‌ని, ప‌లు పార్టీలతో జై తెలంగాణ అనిపించడానికి ప్రజా పోరాటాలను నిర్మించార‌ని క‌విత చెప్పారు.




Tags:    

Similar News