సంచలనం: ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని

Update: 2023-07-31 14:51 GMT

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేసింది. తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సచివాలయంలో సుమారు ఐదు గంటల పాటూ కేబినెట్‌ భేటీ కొనసాగింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులు, రైతులకు జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులపై చర్చించారు. మెట్రో రైలు విస్తరణ, కొత్త కారిడార్లకు అనుమతి వంటి విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజా రవాణాను పటిష్టం చేసేందుకు ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం చేయనున్నామని మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో తెలిపారు. గతంలో చాలాసార్లు ఆర్టీసీ ఉద్యోగులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారని.. తమ ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు కేటీఆర్. అందుకు సంబంధించి పూర్తీ నివేదిక ఇవ్వగానే మిగిలిన పనులను పూర్తీ చేస్తామని అన్నారు. వచ్చే శాసనసభల్లో అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు. హైదరాబాద్ నగరం భారీగా అభివృద్ధి జరుగుతోందని.. అందుకు తగ్గట్టుగా ప్రజా రవాణాను మరింత పటిష్టం చేస్తామని అన్నారు.


Tags:    

Similar News