నల్గొండ : తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ 'బుద్ధవనం' త్వరలో ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఎంతగానో ఆకర్షించనుంది ఈ పార్క్. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల నుండి బౌద్ధులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ పార్క్ స్థాపించబడింది. 274.28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో కాటేజీలు, ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. నాగార్జునసాగర్ హిల్ కాలనీలో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును అతి త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆసియా ఖండంలోనే సిమెంట్‌తో నిర్మించిన అతి పెద్ద స్తూపాన్ని బుద్ధవనంలో నిర్మించారు. శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్తూపం గోడలపై బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టేలా చెక్కిన శిల్పాలను ఏర్పాటు చేశారు. లుంబిని, సారనాథ్, బుద్ధగయ, కృషి నగర్ బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దారు.
బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా బుద్ధవనంలో 8 పార్కులు ఏర్పాటు చేశారు. మొదటి పార్కులో బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలు ఏర్పాటు చేశారు. రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు నిర్మించారు. మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు. నాలుగోది ప్రపంచ స్తూపాల పార్కు. 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఐదో పార్కులో ఏర్పాటు చేశారు.ఆరవ పార్కును ధ్యాన వనంగా మార్చగా.. ఏడో పార్కులో మహాస్తూపం నిర్మించారు. ఎనిమిదో పార్కును స్తూప వనంగా తీర్చిదిద్దారు. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన మల్వాల రాయితో ఇక్కడ శిల్పాలను చెక్కారు. బుద్ధ వనంలోకి ప్రవేశించే 3 ప్రధాన మార్గాల వద్ద పల్నాటి పాలరాయిని వాడారు. బుద్ధుడి జీవితం 22 రకాల చెట్లతో ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో బుద్ధవనంలోనూ ఈ 22 రకాల చెట్లను పెంచుతున్నారు.
బుద్ధవనం మధ్యలో ఒక మహా స్థూపం ఉంది. ఇది అమరావతి స్థూపం లాగానే ఆకారం, రూపకల్పనను కలిగి ఉంటుంది. మహా స్తూపం గ్రౌండ్ ఫ్లోర్‌లో మ్యూజియం, యాంఫీథియేటర్.. ఇతర సదుపాయాలతో పాటు వివరణ కేంద్రం ఉన్నాయి. డ్రమ్, గోపురం, రెయిలింగ్ శిల్ప ఫలకాలతో అలంకరించబడ్డాయి. బౌద్ధ పార్కులో ఆచార్య నాగార్జున ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హయ్యర్ బుద్ధిష్ట్ లెర్నింగ్, దిగువ కృష్ణ వ్యాలీ పార్క్ ఉన్నాయి. ఇందులో ఎకో-టూరిజం రిసార్ట్‌లు కూడా ఉన్నాయి.
ఎలా చేరుకోవాలంటే:
ఈ పార్క్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 144 కిలోమీటర్ల దూరంలో ఉంది. Google మ్యాప్స్‌లో పార్కు లొకేషన్: