చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందన ఇదే..!

Update: 2022-11-11 07:32 GMT

తెలుగు దేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా సీనియర్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలంగాణ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాసాని మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తానని.. హైదరాబాద్ నడిబోడ్డుననే టీడీపీ ఆవిర్భవించిన విషయాన్ని ఈ సందర్భంగా కాసాని గుర్తు చేశారు. చంద్రబాబు అంటే క్రమశిక్షణ అని... క్రమశిక్షణ అంటే చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధే పార్టీ శ్రేణులకు ఎజెండా అన్న కాసాని... చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపై పుట్టిందని... తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెస్తామని చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణకు ఎవరైనా రావచ్చని... ప్రజల మనసులను గెలుచుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుంటే ఆయనను కలిసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు. ప్రధానిని కలిసి ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ఒత్తిడి చేయాల్సిన ముఖ్యమంత్రి, దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం లేదని షర్మిల అన్నారు.


Tags:    

Similar News