4.5 లక్షల బస్తాల బియ్యం మిస్సింగ్: కేంద్రం

రాష్ట్రంలోని 40 రైస్‌ మిల్లుల్లో.. ఒక్కొక్కటి 40 కిలోల బరువున్న 4,53,896 బస్తాల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయమై గవర్నర్ డాక్టర్ తమిళిసై

Update: 2022-04-21 05:17 GMT

హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి తరుణంలో రైస్‌మిల్లర్ల వైపు కేంద్రం మెల్లగా దృష్టి సారిస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాండమ్ ఫిజికల్ వెరిఫికేషన్‌లో రైస్ మిల్లర్లు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని 40 రైస్‌ మిల్లుల్లో.. ఒక్కొక్కటి 40 కిలోల బరువున్న 4,53,896 బస్తాల బియ్యం మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయమై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత లేఖపై కిషన్ రెడ్డి బుధవారం స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరితే కేంద్రం సాయం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న రైస్ మిల్లులపై కేంద్రానికి ఎటువంటి అధికార పరిధి లేనందున నేరుగా జోక్యం చేసుకోలేమని ఆయన అన్నారు.

కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరి సేకరణపై రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా రైస్ మిల్లర్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. తప్పు చేసిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి ఎఫ్‌సిఐ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పలు వివరాలను తెలియజేసిందని, స్టాక్స్‌లో ఇంత భారీ వ్యత్యాసానికి కారణమేమిటో తెలుసుకోవాలని ఎఫ్‌సిఐ కోరింది. సంబంధిత రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, చర్యలు తీసుకున్న నివేదికను అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాయనుంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకే: గంగుల
ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశపూర్వక ప్రయత్నమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. బీజేపీ రాజకీయ వ్యూహమని ఆయన అన్నారు. కిషన్‌ ఆరోపణలకు గురువారం కౌంటర్‌ ఇస్తానని చెప్పారు. కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం డబ్బులు స్వీకరించడంలో ఆలస్యం కారణంగా స్టాక్‌ను విక్రయించి ఉండవచ్చు, అలా చేసి వారు తమ నిర్వహణ ఖర్చులను పొంది ఉండవచ్చు అని ఆయన అన్నారు. "ఎఫ్‌సిఐకి డెలివరీ చేయదగిన స్టాక్‌ల కదలిక నెమ్మదిగా ఉండటంతో, స్టాక్‌లు నిండిపోతున్నాయి. ఫిబ్రవరిలో కురిసిన వర్షాలకు అవి తడిసి నిల్వలు దెబ్బతిన్నాయి. మూడు నుంచి నాలుగు శాతం మిల్లర్లు తప్పు చేశారనే కారణంతో ఎఫ్‌సీఐ మనందరినీ దొంగల్లా చూస్తోందని" వరంగల్ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు తోట సంపత్ అన్నారు.
కొందరు మిల్లర్లను ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉందని రైస్ మిల్లర్ల రాష్ట్ర నాయకుడు దేవేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ, కేంద్రం (FCI) ఏ స్టాక్ ఆఫర్ చేస్తుందో దాన్ని బట్టి క్లియర్ చేయవలసిన అవసరం ఉందని అన్నారు. రైస్ మిల్లుల్లో రూ. 9,000 కోట్ల విలువైన బియ్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు.


Tags:    

Similar News