జగ్గూ భాయ్ వర్సెస్ రేవంత్ ... రాజుకున్న వివాదం

తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం కాంగ్రెస్ నేతల్లో 90 శాతం మందికి ఇష్టం లేదు

Update: 2022-02-19 08:42 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే రెండు అడుగులు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కు లాగుతున్నారు. కాంగ్రెస్ కు ఎవరో శత్రువు కాదు. ఆ పార్టీ నేతలే శత్రువని మరోసారి రుజువయింది. కాంగ్రెస్ ను ఎవరూ నాశనం చేయలేరు. ఆ పార్టీ నేతలు తప్ప. ఇది సత్యం. ఇప్పుడు జగ్గారెడ్డి, వి.హనుమంతరావు వైఖరిని చూస్తుంటే రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారనే చెప్పాలి.

పదిశాతం మంది మాత్రం....
తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం కాంగ్రెస్ నేతల్లో 90 శాతం మందికి ఇష్టం లేదు. అయితే నేరుగా రేవంత్ ఎంపిక రాహుల్ గాంధీ నిర్ణయం కావడంతో అసంతృప్తి ఉన్నా 80 శాతం మంది కాంగ్రెస్ నేతలు సర్దుకుపోయారు. పది శాతం మంది మాత్రం అవకాశం వచ్చినప్పుడు రేవంత్ పంటి కింద రాయిలా మారేందుకే ప్రయత్నిస్తున్నారు. నిజానికి జగ్గారెడ్డికి జరుగుతున్న టార్చర్ ఎవరికీ జరగకూడదు.
కట్టడి చేసి ఉంటే....
అది రేవంత్ రెడ్డి అనుచరులే చేస్తున్నారని జగ్గారెడ్డి అనుమానం. తనను టీఆర్ఎస్ కోవర్టుగా పోస్టింగ్ లు పెడుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. నిజానికి జగ్గారెడ్డి ఈ ఆరోపణలు రేవంత్ పీసీసీ చీఫ్ కాకముందు నుంచే చేస్తున్నారు. పీసీసీ చీఫ్ అయిన తర్వాత అయినా రేవంత్ తన అనుచరులకు వార్నింగ్ ఇచ్చి ఇటువంటి పోస్టింగ్ లకు అడ్డుకట్ట వేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వ్యతిరేకంగా...
అదే సమయంలో జగ్గారెడ్డిని చూసుకుని వి.హెచ్ లాంటి నేతలు కూడా రేవంత్ కు వ్యతిరేకంగా హైకమాండ్ కు ఫిర్యాదు చేయడానికి రెడీ అయిపోయారు. రేవంత్ ను ఇప్పటికిప్పుడు పదవి నుంచి తొలగిస్తే రేవంత్ కు వ్యక్తిగతంగా జరిగే నష్టం కన్నా పార్టీకే ఎక్కువ నష్టం. ప్రజలు ఇప్పుడిప్పుడే కొద్దో గొప్పో కాంగ్రెస్ పై నమ్మకం పెంచుకుంటున్న సమయంలో ఈ రచ్చ పార్టీని మరింత దిగజారుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. జగ్గారెడ్డి రాజీనామాకు సిద్ధపడటం నిజమే. ఆయన ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని, త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఆయన చెబుతున్నారు.


Tags:    

Similar News