గోక్కోవడమంటే ఇదే... గీకితే చెదిరిపోతుందా?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై రాజకీయంగా ఏపీలో రగడ ప్రారంభమయింది.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పై రాజకీయంగా ఏపీలో రగడ ప్రారంభమయింది. రాజకీయంగా ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని విభేదిస్తున్నారు. అధికార భాషా సంఘం ఛైర్మన్ పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. వల్లభనేని వంశీ సయితం పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న సహజంగానే అందరికీ కలుగుతుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా వివాదంగా మారింది. దేశంలోనే మొదటి వైద్య విశ్వవిద్యాలయంగా పేరు గడించింది.
జిల్లాకు పేరు...
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ పేరుతో జిల్లాను పెట్టి ఉండవచ్చు కాక. ఎన్టీఆర్ ను ఏనాడు విమర్శించకపోయి ఉండవచ్చు గాక. మనసులో కల్మషం లేకపోయి ఉండవచ్చు. ఎన్టీఆర్ పట్ల ఆయన గౌరవభావం ఇప్పటి వరకూ ప్రదర్శిస్తూ ఉండిఉండవచ్చు గాక. కానీ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై అభ్యంతరాలు మాత్రం అధికంగానే వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీలోనే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారు అనేక మంది ఉండొచ్చు. కానీ వారు బయటకు చెప్పలేని పరిస్థితి. పేరు మార్చడానికి ఇక్కడ చంద్రబాబు కారణం కాకూడదు. ఆయన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఉండవచ్చు. కాదనలేం కాని.. ఎన్టీఆర్ పేరు మార్చడం మాత్రం నిజంగా అభ్యంతరకరమే.
తాను సమర్థించుకున్నా...
జగన్ పేరు మార్చడంపై తనను తాను సమర్థించుకోవచ్చు. వైఎస్ స్వతహాగా డాక్టర్ అని, ఆరోగ్యరంగంలో సంస్కరణలు తెచ్చారు కాబట్టి పేరు మార్చానని చెప్పుకోవచ్చు. కానీ 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ లేని ఆలోచనను ఆయన చేశారు. వైద్యకళాశాలలన్నింటినీ ఒకే గొడుగుకిందకు తెస్తూ యూనివర్సిటీని తెచ్చిన ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి ఆమోదయోగ్యం. డాక్టరయినంత మాత్రం ఆరోగ్య యూనివర్సిటీకి, పైలట్ అయినంత మాత్రాన విమానాశ్రయానికి పేరు పెట్టే సంప్రదాయం లేదన్నది జగన్ గుర్తుంచుకోవాలి. జగన్ తాను చేసుకునే సమర్థన ఎవరినీ మెప్పించదు. ఎవరినీ ఒప్పించదు.
పేపర్ మీదనే...
వైఎస్ఆర్ పై ప్రేమ ఉండటంలో తప్పు లేదు. ఆయనకు గుర్తుగా వేరే చోట పేరు పెట్టుకోవచ్చు. అందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న పేరును ఒక యూనివర్సిటీకి తొలగించడంపై ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. అధికారం, అసెంబ్లీలో సంఖ్యాబలంతో పేరు మార్చుకోవచ్చు. కానీ అది ఆ యూనివర్సిటీ పేపర్లకే పరిమితమవుతుంది. ఉత్తర్వులలో కనపడుతుంది. కానీ నానుడి, జనం దృష్టిలో మాత్రం ఎల్లప్పడూ అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే ఉండి పోతుందన్నది కాదనలేని వాస్తవం. జగన్ సర్కార్ ఇది గుర్తెరిగి నడచుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నామని పేరు మార్చారు. రేపు మరొకరు అధికారంలోకి వస్తే ప్రతి పథకానికి పేరు మారుస్తారు. ఆ సంప్రదాయం ఎవరికీ మంచిది కాదు. ఇక వేరే పనులు లేనట్లు ఈ పేర్ల మార్పు గొడవ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదు.