వచ్చాడండీ .. అమర్థ్యసేన్..?
మూడేళ్లలోనే ఏపీ జనానికి జగన్ పై వ్యతిరేకత వచ్చిందని ఏబీఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి పై ఆందోళన చెందారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు చూస్తే ఆంధ్రప్రదేశ్ తగలపడిపోతుందని పిస్తుంది. ఇక ఏపీకి ఏ కోణంలో చూసినా భవిష్యత్ లేదని పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ను జగన్ సర్వనాశనం చేసేశాడని రాధాకృష్ణ ఆడిపోసుకున్నాడు. తన కొత్త పలుకులో సునిశిత విమర్శ అని చెబుతూనే జగన్ ముఖ్యమంత్రిగా అనర్హుడని తేల్చేశారు. జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్ లేదని చెప్పేశాడు. అందులో రాయలేదు కాని, చంద్రబాబు తప్ప ఏపీకి ఎవరూ దిక్కులేదని చెప్పకనే చెప్పారు.
అర్జంటుగా దిగిపోతే...?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాలనలో జగన్ పాలనను ముడిపెట్టడం కూడా అందులో భాగమే. రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు బతికి లేరు. చంద్రబాబు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నారు. అందుకే ఆయన ఆ పోలిక పోల్చారు. చంద్రబాబు, వైఎస్ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్లారని కితాబిచ్చారు. అదే వైఎస్ బతికినప్పుడు ఆయనకు ఇది కనపడలేదు. వైఎస్ పాలనలో అవినీతి ఆరోపణలు జరిగాయంటూ ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలుగా కన్పించేవి.
బాబుకు అసలు సన్నిహితులున్నారా?
ఇక రాధాకృష్ణ మరో ప్రశ్న వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు జగన్ వెంట ఎందుకు లేకుండా పోయారు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంటే జగన్ వైఖరి వల్లనే వారు మొఖం చాటేశారంటున్నారు. మరి చంద్రబాబు కు అసలు రాజకీయాల్లో నువ్వు తప్ప ఎవరు సన్నిహితులు ఉన్నారన్న ప్రశ్న అడిగితే రాధాకృష్ణ ఏం జవాబు చెబుతారో మరి. చంద్రబాబు రాజకీయంగా ఇప్పటి వరకూ సన్నిహితులు లేరు. స్నేహితులు లేరు. బంధువులు లేరు. అది అందరికీ తెలిసిందే.
మూడేళ్లలోనే...
కేవలం మూడేళ్లలోనే ఏపీ జనానికి జగన్ అంటే వెగటు పుట్టిందని రాసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితి పై ఆందోళన చెందారు. 66 ఏళ్లుగా ఏపీలో చేసిన అప్పును జగన్ రెండున్నరేళ్లలోనే చేశారంటున్నారు. సంక్షేమ పథకాల మాటున వ్యవస్థలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. మేధావులు బయటకు రావాలని, ఎక్కడకు పోయారని రాధాకృష్ణ ప్రశ్నించారు. చంద్రబాబు, ఈయన మాటలు నమ్మరని కాబోలు మేధావులు రావాలని కోరుకుంటున్నారు. ఇదంతా చూస్తుటే రాధాకృష్ణ ఏడుపు చంద్రబాబును మించిపోయిందని చెప్పాలి. ఆయనకు ఆయనే ఆర్థిక వేత్తగా చెప్పుకుని అక్షరాలను అప్పుతెచ్చుకున్నట్లుగా కనపడుతుంది.
వ్యతిరేకత పెరిగిందని....
జగన్ పై వ్యతిరేకత పెరిగిందట. రావాలి జగన్ అన్న వారే పోవాలి జగన్ అని అంటున్నారట. రాష్ట్రమంతటా ఇదే మాట కోడై కూస్తుందట. ఇక జగన్ ను గద్దె దిగడమే తరువాయి అని చెప్పేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విజయం ఖాయమని రాధాకృష్ణ తేల్చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి జగన్ రెడ్డి చేస్తున్నదేమిటి? అని ప్రశ్నించారు. మొత్తం మీద జనం లో ఎంత వ్యతిరేకత ఉందో తెలియదు కాని, 2019 ఎన్నికలకు ముందు ఫుట్ పాత్ లపై బిక్షగాళ్ల మనోభావాలను చెప్పినట్లే అనిపిస్తుంది ఇప్పుడు జగన్ పై వ్యతిరేకత ఉందని....? మొత్తానికి కామెడీ పీస్ ను చేసేశారు.