మల్లారెడ్డి.. తర్వాత ఎవరు?

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత వరసగా టీఆర్ఎస్ నేతలు ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని గులాబీ పార్టీ నేతల ఆరోపణ.

Update: 2022-11-24 02:48 GMT

మునుగోడు ఉప ఎన్నికల తర్వాత వరసగా టీఆర్ఎస్ నేతలు ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని గులాబీ పార్టీ నేతల ఆరోపణ. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి నిధులు సమకూర్చే నేతలను టార్గెట్ గా చేసుకుని ఆదాయపు పన్ను శాఖ అధికారుల చేత కేంద్రంలో ఉన్న బీజేపీ దాడులు చేయిస్తుందని టీఆర్ఎస్ నేరుగా విమర్శలు చేస్తుంది. గత రెండు రోజులుగా మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేసింది. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. దాదాపు 200 మంది అధికారుల బృందం ఈ దాడులు చేసింది.


టెన్షన్ మొదలు...

దీంతో టీఆర్ఎస్ నేతల్లో కొంత టెన్షన్ ప్రారంభమయింది. వచ్చే ఎన్నికలకు నిధులు సమకూర్చగల నేతలను టార్గెట్ చేసిందన్నది వారి ఆరోపణ. పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ దాడులు జరుగుతున్నాయన్నది టీఆర్ఎస్ నేతల వాదన. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ దాడులు నిర్వహించారు. మైనింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆయన ఇంటిపై, సోదరుల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. అలాగే టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, పార్థసారధి రెడ్డి ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. నామా నాగేశ్వరరావు ఇంటిపైన కూడా దాడులు జరిగాయి.
బెంగాల్ తరహాలోనే...
మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు, కార్యాలయాలపైన కూడా సోదాలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ లో ఇదే తరహాలో దాడులు జరిగాయని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. టీఆర్ఎస్ కు నిధులు సమకూర్చే వారిని భయభ్రాంతులను చేయడానికే ఈ ప్లాన్ చేస్తుందని గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వ్యాపార రంగాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో నిధుల సేకరణకు అడ్డంకులు కల్పించాలన్నది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తుందని అంటున్నారు. ఇక క్యాసినో వ్యవహారంలోనూ ఈడీ టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు.

గప్ చిప్ ...
అయితే మల్లారెడ్డి తర్వాత టార్గెట్ ఎవరు అన్నది టీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అతి సన్నిహితంగాఉన్న ఒక ఎమ్మెల్సీ పై దాడులు జరిగే అవకాశముందని పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఆ ఎమ్మెల్సీకి కూడా విద్యారంగంలో వ్యాపారాలు ఉన్నాయని, నెక్ట్స్ టార్గెట్ ఆయనే నంటూ గులాబీ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. వ్యాపారాలున్న కొందరు నేతలు ఇప్పటికే అప్రమత్తమయ్యారని అంటున్నారు. గులాబీ నేతల్లో మాత్రం గుబులు బయలుదేరింది. పైకి డాంబికాలు పోతున్నా తమ వ్యాపారాల్లో ఉన్న లొసుగులు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తుంది. వ్యాపారం అన్నాక లొసుగులు సహజమేనని, కేసీఆర్ కేంద్రాన్ని థిక్కరించిన తర్వాతనే ఈ దాడులు జరుగుతుండటంతో గులాబీ నేతలంతా గప్ చిప్ .. సాంబార్ బుడ్డిలా.. మారిపోయారంటున్నారు.


Tags:    

Similar News