పాపం.. పవన్.. ఎందుకో ఇలా...?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వినిపిస్తున్నవన్నీ ఆరోపణలే. ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రధాన పార్టీ ప్రయత్నిస్తుంది

Update: 2023-03-07 04:02 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వినిపిస్తున్నవన్నీ ఆరోపణలే. ఆయనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రధాన పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. సరే రాజకీయాలు అన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవం సహజం. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే... నిర్మాణాత్మకమైన విమర్శలు పెద్దగా వినిపించవు. ముఖ్యమంత్రి జగన్ నుంచి పవన్ కల్యాణ్ వరకూ అన్నీ వ్యక్తిగత విమర్శలు. మూడు పెళ్లిళ్ల నుంచి వివేకానందరెడ్డి హత్య వరకూ ఒకరిపై నిందారోపణలు చేసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్నారంటారు. భారతి పే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అందులో నిజనిజాలు ఎవరికీ తెలియవు. ఒకరిని ఒకరు డ్యామేజీని చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి.


అదేంటో గాని...

అయితే పవన్ కల్యాణ్ విషయంలో అదేంటో గాని అంతా విమర్శలకు తగ్గినట్లుగానే ఆయన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. అదే ఆయనకు మరింత ఇబ్బందిగా మారింది. గాలి విమర్శలా..? గట్టి ఆరోపణలా? అన్నది భవిష‌్యత్ తేల్చనుంది. పవన్ కల్యాణ్ కు ఒకరి నుంచి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం ఉండదు. అది అందరికీ తెలిసిందే. ఆయన ఒక్క సినిమాకు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఆయన ఆదాయపు పన్నునే కోట్లలో చెల్లిస్తారని స్వయంగా పవన్ పలు దఫాలు చెప్పారు. అందుకని ఆయనకు డబ్బు అవసరం అంతగా ఉండదు. కష్టించి, సినిమాలు వరసగా చేస్తే ఆయనకు డబ్బు కొరత ఉండదు. కరెన్సీ కట్టలే ఆయన వద్దకు పరుగులు తీస్తాయి. ప్యాకేజీ తీసుకున్నారని ఎవరూ నమ్మకపోయినా చంద్రబాబు విషయంలో కొంత మెతక వైఖరిని అవలంబిస్తున్నారని మాత్రం అనుకోవాల్సి ఉంటుంది.
బస్సు యాత్ర...
ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత సొంతంగా ఎదగాలని ఎవరైనా భావిస్తారు. ఒకరికి అండగా నిలిచి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేయాలని ఎవరూ అనుకోరు. కానీ పవన్ మాత్రం ఆ విషయంలో కొంత ఫ్యాన్స్ ను కూడా నిరాశపరుస్తున్నారు. ఇక ఎప్పుడో దసరాకు తన పర్యటను ప్రారంభిస్తానని చెప్పారు. అయితే అది వాయిదా పడింది. తర్వాత వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. అదిగో వస్తున్నా... ఇదిగో వస్తున్నా అంటూ వాయిదా వేస్తూనే ఉన్నారు. ఒక డేట్ అంటూ ఇంతవరకూ ఫిక్స్ కాలేదు. దీంతో వైరిపక్షం విమర్శలు అందుకుంది. నారా లోకేష్ పాదయాత్ర ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పాదయాత్ర మొదలు పెడతారంటూ అప్పటి వరకూ పీకే బస్సు యాత్రకు చంద్రబాబు పచ్చ జెండా ఊపరంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.

నిజానిజాలు ఎంతనేది?
అందులో నిజానిజాలు ఎంతనేది పక్కన పెట్టినా సాధారణ ప్రజలు వాస్తవమని అనుకునే అవకాశాలు లేకపోలేదు. వారాహికి పూజలు చేసిన పవన్ ఎందుకు బయలుదేరలేదంటే ఏం సమాధానం చెబుతారు? లోకేష్ పాదయాత్ర ప్రారంభమయిన నాటి నుంచి ఏపీకి పవన్ ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్నలకు ఆయనకు సమాధానం తెలియవచ్చు. కానీ జనాలకు మాత్రం తెలియదు కదా? అసలు బస్సు యాత్ర చేస్తానని ఎవరు ప్రకటించమన్నారు? ప్రకటిస్తే ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అంతే తప్ప వాయిదాలు వేసుకుంటూ పోతే ఇలాంటి అపవాదులే ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మకం.. నమ్మకపోవడం ఆయన చేతల ద్వారానే తెలుస్తుంది. అది పవన్ తెలుసుకుంటే మంచిదని సన్నిహితులు సూచిస్తున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం త్వరలోనే వారాహి యాత్ర ఉంటుందని చెబుతున్నారు.


Tags:    

Similar News