ఆనంకు షిప్టింగ్ తప్పదా?
ఆనం రామనారాయణరెడ్డి తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. రెండో సారి కూడా ఆనంకు ఆశాభంగమే ఎదురయింది.
ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అసలు వైసీపీ నుంచి పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు? లాంటి ప్రశ్నలు వైసీీపీ క్యాడర్ లో వ్యక్తమవుతుంది. వైసీపీ అధినాయకత్వం కూడా ఆనం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లే కనపడుతుంది. ఆయనను ఈసారి అసెంబ్లీ బరి నుంచి పక్కకు తప్పించాలన్న యోచనలో ఉందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సీనియర్లను వీలయినంత మేరకు పక్కన పెట్టి కొత్త వారికి అవకాశమివ్వాలన్న ఉద్దేశ్యంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఉన్నారని చెబుతున్నారు.
పట్టున్న ప్రాంతాల్లోనూ..
ఆనం కుటుంబానికి నెల్లూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో పట్టుంది. ప్రస్తుతం ఆయన వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014లో టీడీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి అక్కడ ఏ పదవులు రాకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆత్మకూరు నియోజకవర్గం కోరుకున్నా అక్కడ మేకపాటి కుటుంబం ఉండటంతో చివరకు వెంకటగిరి టిక్కెట్ ను జగన్ ఆనం రామనారాయణరెడ్డికి కేటాయించారు. అయితే వెంకటగిరి పై ఆసక్తి లేకపోయినా పోటీ చేసి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదంటున్నారు.
వెంకటగిరిలో...
అక్కడ నేదురుమిల్లి కుటుంబంతో సఖ్యతగా లేరు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి అక్కడ కీలక నేతగా ఎదుగుతున్నారు. ఆయనకు హైకమాండ్ అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తుందన్న అనుమానం పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డికే వెంకటగిరి టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆత్మకూరు మళ్లీ మేకపాటి కుటుంబానికే దక్కుతుంది. దీంతో ఆనం రామనారాయణరెడ్డి అంగీకరిస్తే ఆయనను నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయించాలని భావిస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డిని పక్కన పెట్టి ఆనంకు నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉందని విశ్వసనీయ సమాచారం.
ఎంపీగా పోటీ...
అయితే ఆనం రామనారాయణరెడ్డి తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. రెండో సారి కూడా ఆనంకు ఆశాభంగమే ఎదురయింది. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీలో గెలిచినా తనకు మంత్రి పదవి వస్తుందన్న నమ్మకం లేదు. టీడీపీలోకి వెళ్లినా అక్కడ సోమిరెడ్డి వంటి సీనియర్ నేతలున్నారు. అందుకే అధినాయకత్వం ఎంపీగా పోటీ చేయమన్నా చేయక తప్పదన్న ఆలోచన ఒకవైపు.. ఈ పార్టీలో ఉంటే ఎదగలేమన్నది మరో వైపు ఎటూ తేల్చుకోలేక పోతున్నారట. అందుకే రెండు రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి.
ఆ మాటల వెనక...
ప్రభుత్వం చివరి వరకూ తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పడం వెనక అర్థం ఏమయిఉంటుందా? అన్న ఆలోచనలో పార్టీ నేతలున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారే అవకాశాలను కొట్టిపారేయలేమని కూడా పార్టీలో పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. తనకు వైసీపీలో సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చన్న ఆశాభావంతనే ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మరి లాస్ట్ మినిట్ లో ఆనం విషయంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరమే.