ఉంటే ఉంటాడు.. పోతే పోతాడు

ఏపీ బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకుసిద్ధమయింది. పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా అదేరకమైన సంకేతాలు అందుతున్నాయి.

Update: 2023-03-23 04:47 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒంటరిగానే వెళ్లేందుకు దాదాపు సిద్ధమయింది. పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కూడా అదేరకమైన సంకేతాలు అందుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని స్పష్టమైన మెసేజ్ హస్తిన నుంచి బెజవాడకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. జాతీయ పార్టీ ఒకరి కోసం వెంపర్లాడే పరిస్థితి లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ చేసిన ప్రసంగాల క్లిప్పింగ్ లను కూడా కేంద్ర నాయకత్వానికి పంపారు. దీంతో ఒకరితో పనిలేకుండా పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించినట్లు రాష్ట్ర ముఖ్య నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.


పవన్ వ్యాఖ్యలను...

తనకు కేంద్ర నాయకులతో ఎలాంటి ఇబ్బందులు లేవని, రాష్ట్ర నేతలతో సమస్య అని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చలో అమరావతి కార్యక్రమాన్ని ఇక్కడ వాయిదా వేయించింది కూడా ఇక్కడి నేతలే అన్నారు. తెలంగాణలో కలసి పోటీ చేయాలనుకున్నా ఆంధ్రోడివని కొందరు అంగీకరించలేదన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర నాయకత్వం కూడా సీరియస్ గా తీసుకున్నట్లుంది. పవన్ కల్యాణ్ తొలి నుంచి టీడీపీ, బీజేపీతో కలసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేశాడు. కానీ బీజేపీతో కలసి పోటీ చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని భావించి పవన్ వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ టీడీపీతో వెళ్లేందుకే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర నేతలు కేంద్ర నాయకత్వానికి వివరించినట్లు తెలిసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ....
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పవన్ మద్దతును బీజేపీ నేతలు కోరినా అందుకు ఆయన సహకరించలేదు. ఈ ఎన్నికలు కాదు బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లోనూ ఆయన తమకు సహకరించలేదన్నది బీజేపీ నేతల వాదన. కేవలం రాష్ట్ర ఎన్నికల సమయంలో కేంద్ర నాయకత్వం అండ కోసమే బీజేపీ మద్దతు కోరుకుంటున్నారని కూడా రాష్ట్ర నాయకత్వం అభిప్రాయపడుతుంది. అందుకే కేంద్ర నాయకత్వం కూడా పవన్ పట్టించుకోకుండా ఎవరి పని వారు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఒకరి బ్లాక్ మెయిల్ కు, ఒకరి వ్యూహాలతో మనం భయపడాల్సిన పనిలేదని, సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నాలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు కాకపోతే.. మరొకసారి ఎప్పటికైనా ఏపీలో బీజేపీ జెండా ఎగురవేయగలమని, పొత్తుల గురించి ఆలోచించవద్దని సూచించినట్లు తెలిసింది. భీమవరంలో జరిగిన సమావేశంలోనే ఈ స్పష్టత వచ్చినా మరోసారి పొత్తులపై కూడా కేంద్ర నాయకత్వం నుంచి స్పష్టత వచ్చినట్లు తెలిసింది.

ఒంటరిగానే...
తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేసే అవకాశం లేనే లేదని కేంద్ర నాయకత్వం సుస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఏమైనా కొద్దిగా మనసులో ఉన్నా వాటిని చెరిపేసి ముందుకు నడవండని రాష్ట్ర నాయకత్వానికి సూచించిందని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో మరోసారి దీనిపై నేతలకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. పవన్ ఎటూ తమతో కలసి రాడని బీజేపీ నేతలకు అర్థమయి పోయింది. బతిమాలనుకుని ప్రయోజనం లేదని, ఎన్నికల సమయానికి కలసి వస్తే చూద్దామని, లేకుంటే లేదని కూడా నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ పొత్తులు కాదనుకుని వెళ్లిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదని, ఒంటరిగానైనా పోరాడేందుకు సిద్ధపడాలని సెంట్రల్ నుంచి సిగ్నల్స్ వచ్చినట్లు తెలిసింది.


Tags:    

Similar News