ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది.

Update: 2022-01-04 12:42 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి అందరు ముఖ్యమైన కేంద్ర మంత్రులను కలిశారు. అమిత్ షాను మాత్రం కలవలేకపోయారు. జగన్ పర్యటన ఈసారి సక్సెస్ ఫుల్ గా ముగిసింది. అందరినీ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్లగలిగారు. జగన్ ప్రధాని మోదీని కలిసి చాలా కాలమే అయింది. గతంలో ఒకసారి ఢిల్లీ పర్యటనకు వచ్చినా ఆయనకు అపాయింట్ మెంట్ లభించలేదు.

ముందుగానే....
ఈసారి ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకుని జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కేంద్ర మంత్రులను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన జగన్ గంటసేపు ఆయనతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు వివిధ పెండింగ్ అంశాలను, రాష్ట్ర విభజన హామీలను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చారు. మోదీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రులను కలసి....
ఇక అదే రోజు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ను కలిశారు. మంగళవారం మొత్తం జగన్ బిజీబీజీగా గడిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి జాతీయ రహదారులపై చర్చించారు. క్రీడల శాఖ మంత్రి అనుగార్ ఠాగూర్ ను కలిసి క్రీడల అభివృద్ధికి సహకరించాలని కోరారు. తర్వాత ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియాలను జగన్ కలిశారు. అమిత్ షాను కలవాలనుకున్నా కుదరలేదు. ఈసారి జగన్ పర్యటనలో అది ఒక్కటే వీలు కాలేదు.
విపక్షాలు ఎప్పటి మాదిరిగానే....
అయితే జగన్ ఢిల్లీ పర్యటన చేసినప్పుడల్లా విపక్షం ఎప్పటి మాదిరిగానే స్పందించింది. కేసుల మాఫీ కోసమే జగన్ కేంద్రం పెద్దలను కలుస్తున్నారని చంద్రబాబు మామూలుగానే విమర్శలు చేశారు. జగన్ కు అపాయింట్ మెంట్లు దొరకకుంటే ఒకలా, దొరికితే మరోలా స్పందించడం వారికి అలవాటేనని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద కొత్త ఏడాది ఆరంభంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నుంచి కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర ప్రయోజనాలను వారి ముందుంచి రావడం శుభపరిణామంటున్నారు.


Tags:    

Similar News