హైకోర్టు విభజన ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అపాయింటెడ్ డేట్ గా రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నోటిఫై చేశారు. ఆ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో పొందుపర్చిన హామీల్లో భాగంగా హైకోర్టు విభజన జరగాల్సి ఉంది. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా అది సాథ్యం కాలేదు. అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం కూడా జప్యానికి కొంత కారణం.
భవనం రెడీ....
అయితే ఇప్పటికే న్యాయమూర్తులు, సిబ్బంది విభజన పూర్తయింది. అమరావతిలోని నేలపాడులో ఏపీ ప్రభుత్వం హైకోర్టు భవన నిర్మాణపనులను ప్రారంభించింది. ఈ నెలలో భవన నిర్మాణపు పనులు పూర్తవుతాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఏపీలో హైకోర్టు పనులు ప్రారంభించనుంది. మొత్తం మీద తెలంగాణ న్యాయవాదుల చిరకాల డిమాండ్ నెరవేరనుంది.