బజ్‌ వర్డ్‌... విశ్వసనీయత!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలు విశ్వసనీయత అనే పదం చుట్టూ తిరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదాన్ని పాపులర్‌ చేసిన మనిషి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రతిష్టను పెంచుకున్నారు ఆయన. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన ఆరోపించేవారు. రైతులకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఉత్తర్వుపైనే చేశారు.

Update: 2023-12-23 06:44 GMT

AP elections

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలు విశ్వసనీయత అనే పదం చుట్టూ తిరగనున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదాన్ని పాపులర్‌ చేసిన మనిషి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి. తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా ప్రతిష్టను పెంచుకున్నారు ఆయన. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన ఆరోపించేవారు. రైతులకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఉత్తర్వుపైనే చేశారు. 2009 ఎన్నికల నాటికి రాజశేఖరరెడ్డి తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి పోరాటం, మీడియా వ్యతిరేకత, సొంత పార్టీ నేతల అంటీ ముట్టని వ్యవహార శైలి ఆయన గెలుపును కష్టం చేశాయి. హామీల అమలు తీరే ఆయనను స్పల్ప మెజార్టీతో గట్టెక్కించింది.

జగన్‌ కూడా హామీల అమలే లక్ష్యంగా గత నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్‌ అంటూ పథకాల అమలు తేదీని ముందుగా ప్రకటించి, నిధులు విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తన తండ్రిలాగే విశ్వసనీయత అనే పదాన్ని తరచుగా జగన్‌ వాడుతూ ఉండేవారు. చంద్రబాబు తన హామీలను విస్మరించారని, మ్యానిఫెస్టోను వెబ్‌సైట్‌లోంచి మాయం చేశారని తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టారు. నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ వంటి అంశాలు అమలు చేయకపోవడాన్ని పదే పదే ప్రస్తావించేవారు..

తన పాదయాత్రలో నవరత్నాలు అంటూ హామీ ఇవ్వడమే కాకుండా, వాటిని తు.చ తప్పకుండా అమలు చేయాలని జగన్‌ దృఢంగా నిశ్చయించుకున్నారు. 2019 ఎన్నికల్లో నవరత్నాలే కాకుండా, చంద్రబాబుకు విశ్వసనీయత లేదనే ఆరోపణను కూడా జనం నమ్మారు, జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. తాను చేసిన వాగ్దానాలే తనను 2024లో కూడా గెలిపిస్తాయనే ధైర్యంతో జగన్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు చంద్రబాబు కూడా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెబుతున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ప్రతీ నెలా 1500 రూపాయల చొప్పున మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ, ప్రతినెలా 3000 రూపాయల నిరుద్యోగ భృతి... ఇవన్నీ ఇప్పటివరకూ సైకిల్‌ పార్టీ ఇచ్చిన హామీలు. ఇంకా జనసేనతో కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించినప్పుడు మరిన్ని వరాలు బయటకు వస్తాయి. జగన్‌ విశ్వసనీయత అనే పదం వాడుతున్నారు కాబట్టి, హామీల అమలు చేస్తామని బాండ్‌ పేపర్‌ మీద రాసి ఇస్తామని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ప్రజలు ఎవరి విశ్వసనీయతను విశ్వసిస్తారో చూడాలి.

Tags:    

Similar News