నారా చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు.. విచారణకు హాజరు కావాల్సిందే

చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా..

Update: 2022-04-23 03:23 GMT

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతో చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టం, సెక్షన్ 14 ప్రకారం కమిషన్‌కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డుకుని గొడవ పడ్డారని, అక్కడి రోగులను భయాందోళనలకు గురి చేశారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలి అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

అసలు ఏం జరిగిందంటే..
విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఏపీ విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అత్య‌చార బాధితురాలు, ఆమె త‌ల్లి స‌మ‌క్షంలోనే వీరిద్ద‌రూ ఒక‌రిపై ఆరోపణలు చేసుకున్నారు. బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు వాసిరెడ్డి ప‌ద్మ రాగా అప్ప‌టికే అక్క‌డికి చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ఆసుప‌త్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. బొండా ఉమా, టీడీపీ నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఇప్పటికిప్పుడు మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చి హడావిడి చేశారనిస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైతే మహిళ కమిషన్ ఛైర్ పర్సన్‌కు ఇప్పటి వరకు కనపడలేదా అన్నారు.
వాసిరెడ్డి ప‌ద్మను లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆమె వెళ్లక ముందే అక్క‌డికి చంద్ర‌బాబు వచ్చారు. రాష్ట్రంలో ఇంత దారుణాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నార‌ని వాసిరెడ్డిని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము కూడా బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని, నేరాల కట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పద్మ బ‌దులిచ్చారు. ఇంతలో టీడీపీ నాయకురాలు పంచుమ‌ర్తి అనురాధ వచ్చి.. వాసిరెడ్డి ప‌ద్మ‌పై విమర్శలు చేశారు. ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌ని భావించిన చంద్ర‌బాబు అనురాధను సంయ‌మనం పాటించాలంటూ సూచించారు.
టీడీపీ నేతల తీరుపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళితే టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, మహిళల పట్ల రాజకీయం చేయడానికి సిగ్గుగా లేదా అన్నారు. మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ను బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. చంద్రబాబు ఆసుపత్రికి వస్తున్నాడని తనను అడ్డుకున్నారని.. తాను టీడీపీ నేతలను నెట్టుకుంటూ, వారి నుంచి తప్పించుకొని లోపలికి వెళ్లినట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయినా తాను సంయమనం పాటించానన్నారు. బాధితురాలితో మాట్లాడుతుండగా బొండా ఉమా అడ్డుకునే ప్రయత్నం చేసి.. తనపట్ల అనుచితంగా ప్రవర్తించారన్నారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.


Tags:    

Similar News