ఎన్నికల నాటికి అందరూ వస్తారట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి గెలిచేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

Update: 2022-07-12 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి గెలిచేందుకు అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. తన పాలనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగిస్తారు. మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని సామాజికవర్గాలకు లబ్ది చేకూరే విధంగా ఈ రెండేళ్లలో నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే నూతన పథకాలను ప్రజలకు అందించేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఇది ఒక భాగం. మరో వైపు అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయనున్నారు.

కుటుంబంలో చీలికపై...
అయితే వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక ప్రచారం పై కూడా వచ్చే ఎన్నికల నాటికి స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్లీనరీలో విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. అది జగన్ చేయించారన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. విజయమ్మ తనంతట తాను తప్పుకున్నానని ప్లీనరీలో చెప్పినా ప్రజలు విశ్వసించడం లేదు. అలాగే వైఎస్ షర్మిల విషయంలోనూ జగన్ అన్యాయం చేశాడని, గత ఎన్నికల్లో కష్పపడి పనిచేేసిన షర్మిలకు కనీసం పదవి కూడా ఇవ్వకపోవడంతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకుని వెళ్లిపోయారన్న ప్రచారమూ ఉంది.
ఎన్నికల నాటికి...
ీఈ ప్రచారాలపై వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఒక స్పష్టత కూడా తేనున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తయిన తర్వాత జరిగే ఏపీ ఎన్నికల్లో విజయమ్మ తిరిగి ప్రచారంలో పాల్గొంటారు. ఇక షర్మిల నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా జగన్ కు మద్దతు ప్రకటించే విధంగా ప్రకటన అయినా ఉంటుందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో పార్టీ చీఫ్ గా ప్రచారానికి రాకపోయినా ప్రకటన రూపంలో జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సునీత కూడా...
ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ విమర్శలు నేరుగా ఎదుర్కొంటున్నారు. ఆ హత్య కేసులో నిందితులను జగన్ రక్షిస్తున్నారని ఆరోపణలు విన్పించాయి. చంద్రబాబు అయితే బాబాయి హత్య కేసు అంటూ ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీత కు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చెబుతున్నారు. పులివెందుల లేదా జమ్మలమడుగు నుంచి సునీత ను పోటీ చేయించే అవకాశాలు లేకపోలేదు. సునీతతో సంప్రదింపులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.
కొత్త ఎత్తుగడలతో...
కుటుంబ సభ్యులు దూరమయ్యారన్న ప్రచారానికి ఎన్నికల సమయంలోనే జగన్ తెరదించుతారని, ఆ అంశానికి ఎన్నికల్లో చోటు లేకుండా చూస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. జగన్ ఏదైనా చేయొచ్చు. జరగవని భావించే సంఘటనలు జరిపిస్తాడు. అలాగే ఊహకు అందని కొత్త ఎత్తుగడలతో వచ్చే ఎన్నికలకు ముందుకు వస్తాడు. అందుకే జగన్ ఎత్తులు ఎలా ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకులకు సయితం అర్థం కానివి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరోక్ష మద్దతు, కొత్త ఎత్తులతో జగన్ మరీ పొత్తులతో వస్తున్న విపక్షాలను చిత్తు చేస్తారని వైసీపీకి చెందిన ఒక సీనియర్ నేత తెలుగుపోస్టుకు చెప్పారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News