బాబూ... వినవా.. జగనన్న కథ ఒకటి
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ లోకల్ సమస్య పెద్దదిగా కనపడుతుంది. చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు
గత ఎన్నికలకు ముందు పొలిటికల్ సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది. 2014 ఎన్నికలకు ముందు ఇదే అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికలకు ముందు వరకూ ఒకటే మాట. జగన్ లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేస్తున్నారని. అక్కడే పార్టీ సమీక్షలు సమావేశాలు నిర్వహించేవారు. హైదరాబాద్‌లోనే నివాసం ఉండి ఆంధ్రప్రదేశ్ కు మాత్రం పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు. నేతలు చేరినా లోటస్ పాండ్ లోనే చేరేవారు. 2014లో జగన్ ఓటమికి కూడా అది కారణంగా చెబుతారు విశ్లేషకులు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగినా జగన్ అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పరాయివాడిగానే ప్రజలు భావించారంటారు.
నాడు జగన్ పైనా...
2014 ఎన్నికల్లో ఓటమి జగన్ కు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. నిజానికి జగన్ కు ఇడుపులపాయలో ఇల్లు ఉంది. కడప జిల్లాలోనే పుట్టారు. అయినా ప్రజలు మాత్రం హైదరాబాదీగానే జగన్ ను పరిగణించారంటారు.దీంతో 2019 ఎన్నికలకు ముందు జగన్ తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకుని 2019 ఫిబ్రవరి 14న గృహప్రవేశం చేశారు. ఆ విమర్శలకు చెక్ పెట్టగలిగారు. ఆ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 151 స్థానాలు గెలవడం అంటే ఆషామాషీ కాదు. వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పడానికి కూడా ఎంత మాత్రం వెనకాడరు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అదే చంద్రబాబుకు కూడా ఎదురవుతుంది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.
సొంత ఇల్లు...
నిజానికి చంద్రబాబుది కూడా సొంత ఊరు నారావారి పల్లి. ఆయన అక్కడ సొంత ఇల్లు ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం లోనూ ఇల్లు కట్టుకోవడానికి స్థల సేకరణ జరిపారు. ఇంకా పనులు మొదలు కాకపోయినా కుప్పంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా చంద్రబాబుకు ఏపీలో సొంత ఇల్లు అంటూ లేదు. నారావారి పల్లెలో ఉన్నా అది సంక్రాంతి సంబరాలకే పరిమితమయిపోయింది. పదేళ్ల నుంచి నివాసం కరకట్ట మీదనే. అదీ ఒంటరిగానే. కుటుంబం మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది. అక్కడి నుంచే వ్యాపారాలను నిర్వహిస్తుంది. శుక్రవారం రాత్రికి వెళ్లి శని, ఆదివారాలు హైదరాబాద్ లోనే చంద్రబాబు గడుపుతున్నారు. ఇక కరోనా సమయంలో హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇది చంద్రబాబుకు సమస్యగా మారింది. మొన్నా మధ్య చంద్రబాబు విజయవాడలో ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచనకు వచ్చి, స్థలాలను పరిశీలించి ఆ తర్వాత మిన్న కుండిపోయారు.
పార్టీ నేతల నుంచే...
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో సొంత పార్టీకి చెందిన నేత నుంచి ఇదే ప్రశ్న ఎదురు కావడంతో పెద్దాయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మాజీ సర్పంచ్ కావచ్చు. ఆయన నేరుగానే చంద్రబాబును అడగటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది ఆ పార్టీ నేత ఒక్కరిదే కాదట. పార్టీ కార్యకర్తలందరిదీ అని చెప్పేశారు. దీంతో చంద్రబాబు డైలమాలో పడిపోయారు. లోకేష్ పాదయాత్రకు కూడా అంత రెస్పాన్స్ రాలేదు. లోకేష్ ను కూడా నాన్ లోకల్ కిందనే అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలా లోకల్ గా చంద్రబాబు మారాలంటే ఇల్లుకోక తప్పదంటున్నారు పార్టీ నేతలు. కేవలం ఇల్లు నిర్మించుకుంటే చాలదని, కుటుంబంతో సహా ఇక్కడకు వస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని అనే వారు పార్టీలోనూ కనపడుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈలోగా చంద్రబాబు బెజవాడలో ఇల్లు కట్టుకుంటారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.