'అసని'కి అనుసంధానంగా ద్రోణి.. ఏపీతో పాటు తెలగాణకు వర్షసూచన

ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కొనసాగుతోన్న అసని.. రానున్న 24 గంటల్లో బలహీన పడి తుఫానుగా మారవచ్చని

Update: 2022-05-10 12:05 GMT

హైదరాబాద్ : బంగాళాఖాతంలో అసని తుఫాను కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారిన అసని.. మంగళవారానికి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి కాకినాడకు ఆగ్నేయ దిశగా 210 కిలోమీటర్ల దూరంలో విశాఖకు 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో ఇప్పటికే.. ఏపీలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన మోస్తరు, భారీ వర్షాలు మొదలయ్యాయి. నేటి రాత్రికి.. అసని తుఫాన్ ఉత్తరాంధ్రప్రదేశ్ తీరానికి చేరువలో వచ్చి.. ఆపై దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా కదిలి ఉత్తర ఆంధ్ర-ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రస్తుతం తీవ్ర తుఫానుగా కొనసాగుతోన్న అసని.. రానున్న 24 గంటల్లో బలహీన పడి తుఫానుగా మారవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్నం వెల్లడించారు. తుఫాను ప్రభావం ఏపీలోని తీరప్రాంతాలకు ఆనుకుని ఉన్న జిల్లాలపై ఉండవచ్చని ఆమె తెలిపారు. అసని తుఫాను అనుసంధానంగా బంగాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని నాగరత్నం వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని తెలిపారు. ద్రోణి ప్రభావం, తుఫాను ప్రభావం సమాంతరంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నాగరత్నం పేర్కొన్నారు.



Tags:    

Similar News