పెద్దాయన పదవి కిందకు నీళ్లొచ్చాయా?

అశోక్ గెహ్లాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి

Update: 2022-09-22 12:27 GMT

అశోక్ గెహ్లాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన ఏఐసీసీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి విముఖత చూపుతుండటంతో అశోక్ గెహ్లాత్ ను పోటీ చేయాలని టెన్ జన్ పథ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం అశోక్ గెహ్లాత్ సోనియా గాంధీని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారంటున్నారు. దీంతో అశోక్ గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జోడో యాత్రలో...
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్నారు. ఆయన కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. నిజానికి కొన్నేళ్ల నుంచి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా లేరు. అయినా ఆయన చెప్పినట్లు.. ఆయన అనుకున్నట్లు పార్టీ నడుస్తుంది. పార్టీ నిర్ణయాలు కూడా రాహుల్ ఇంట్లోనే జరుగుతాయి. కాకుంటే అధ్యక్షుడు గాంధీయేతర కుటుంబం నుంచి ఉండటం మంచిదన్న ధోరణిలో రాహుల్ గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ కుటుంబం సొత్తు కాదని, ఎవరైనా పోటీ చేయవచ్చన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు.
ఇద్దరూ పోటీ...
ఏఐసీసీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాత్, శశిథరూర్ లు పోటీ పడే అవకాశముంది. వీరిద్దరిలో అశోక్ గెహ్లాత్ వైపే గాంధీ కుటుంబం మద్దతు ఉండటంతో ఆయన గెలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే గాంధీ కుటుంబం వెంటనే అన్ని రాష్ట్ర పార్టీ కార్యవర్గాలు ఉన్నాయి. సీనియర్ నేతగా ఉన్న అశోక్ గెహ్లాత్ ను అధ్యక్షుడిగా చేయాలన్నది సోనియా గాంధీ నిర్ణయం కూడా. అయితే ఆయనకు ఇష్టం లేదు. రాజస్థాన్ ను వదిలి పెట్టి జాతీయ రాజకీయాల్లోకి రావడం సుతారమూ ఇష్టపడని పెద్దాయన ఇప్పటి వరకూ పక్కన పెడుతూ వచ్చారు. కానీ చివరకు కిరీటం ఆయన తలపై బలవంతంగా పెట్టే అవకాశాలయితే కన్పిస్తున్నాయి.
అధ్యక్షుడిగా ఎన్నికయితే...
ఇక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఉదయపూర్ లో జరిగిన చింతన్ శిబిర్ తీర్మానాన్ని రాహుల్ గాంధీ కూడా గుర్తు చేశారు. ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్నది ఖచ్చితంగా పాటించాల్సిందేనని రాహుల్ గాంధీ కూడా అన్నారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికయితే అశోక్ గెహ్లాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన స్థానంలో రాహుల్ మిత్రుడు సచిన్ పైలట్ ను నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 24 వతేదీ నుంచి నామినేషన్ ప్రారంభమవుతుంది. మరి అశోక్ గెహ్లాత్ నామినేషన్ వేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 
Tags:    

Similar News