ఆ మూడు కొత్త జిల్లాల ప్రత్యేకత ఇదేనా?
కొత్త జిల్లాల ఏర్పాటుకు చేసిన కసరత్తును పక్కన పెడితే జగన్ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు చేసిన కసరత్తును పక్కన పెడితే జగన్ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలకు దేవుళ్ల పేర్లు పెట్టింది. మూడు జిల్లాలకు ప్రజలు తమ దేవుళ్లుగా భావించే వారి పేర్లను పెట్టింది. కొందరు దేవుళ్లు అనడానికి అభ్యంతరం చెప్పవచ్చు కాని, మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ఈ పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది.
బాలాజీ జిల్లాగా...
తిరుపతి పార్లమెంటు పరిధిలో ఏర్పడబోతున్న జిల్లాకు బాలాజీ జిల్లాగా, రాయచోటి కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు అన్నమయ్య జిల్లాగా, పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడుతున్న జిల్లాకు సత్యసాయి జిల్లాగా నామకరణం చేశారు. ఇందులో తిరుపతి కేంద్రంగా ఏర్పడుతున్న బాలాజీ జిల్లాలో సర్వేపల్లిని మినిహాయించారు. సర్వేపల్లి గతంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేది. సర్వేపల్లి నియోజకవర్గం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు పార్లమెంటు నియోకవర్గం పరిధిలోని చంద్రగిరి అసెంబ్లీని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు.
అన్నమయ్య జిల్లాగా....
ఇక అన్నమయ్య జిల్లాకు కూడా విశిష్టత ఉంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉన్న పుంగనూరును చిత్తూరు జిల్లాలో కలిపారు. అలాగే రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
సత్యసాయి జిల్లాగా....
ఇక పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాకు సత్యసాయి జిల్లాగా నామకరణం చేయనున్నారు. పుట్టపర్తి సత్యసాయి ఉన్న ఊరు కావడంతో ఆయన పేరిట జిల్లా ఏర్పాటు కాబోతోుంది. సత్యసాయి జిల్లా పరిధిలోకి పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. దీంతో మొత్తం మూడు జిల్లాలకు జగన్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న సెంటిమెంట్ ను, అక్కడ ప్రాముఖ్యతలను బట్టి పేర్లను నిర్ణయించింది.