అటల్ ఆరోగ్యం మరింత విషమం

Update: 2018-08-16 06:08 GMT

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆయన అనారోగ్యంతో పారాడుతున్న తీరుకు తామే ఆశ్చర్యపోతున్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. మూత్రపిండాల్లో ఒకటి మాత్రమే పనిచేస్తుందని, ఊపిరితిత్తులు బలహీనపడ్డాయని, షుగర్ వ్యాధి కారణంగా వాజ్ పేయి పరిస్థితి విషమంగా తయారైందని వైద్యులు తెలిపారు. 93 ఏళ్ల వాజ్ పేయి అనారోగ్యంతో ఈ ఏడాది జూన్ 11న ఎయిమ్స్ లో చేరారు. గత తొమ్మిది వారాల నుంచి వాజ్ పేయికి చికిత్స జరుగుతోంది. వాజ్ పేయి ఆరోగ్యం కుదుటపడాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

ఆసుపత్రికి చేరుకుంటున్న అగ్రనేతలు

వాజ్ పేయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తమ కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకుని ఆసుపత్రికి వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఎయిమ్స్ కి వస్తున్నారు. బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎల్.కె.అద్వానీ, నిర్మలా సీతారామన్, గడ్కరి, నడ్డా, ప్రకాశ్ జవదేకర్ తదితరులు వాజ్ పేయిని పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్ పేయి బంధువులు సైతం గ్వాలియర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయవతి సైతం మరికొద్ది సేపట్లో ఆసుపత్రికి రానున్నారు.

Similar News