సోముకు షాక్ తప్పదా?

బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీ పైనా ఫోకస్ పెంచింది.

Update: 2022-08-24 06:13 GMT

బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీ పైనా ఫోకస్ పెంచింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఓటు బ్యాంకు కూడా లేదు. గత ఎన్నికలలో నోటాకంటే తక్కువ ఓట్ల శాతం వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లే కనపడుతుంది. ఒక పార్టీ మద్దతుతో ఇక ఎన్నికలకు వెళ్లకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నాలను ప్రారంభించిందనే చెప్పాలి. నేరుగా కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగిందని చెప్పాలి. బీజేపీ ఎక్కడైనా ఒకే వ్యూహంతో వెళుతుంది. అన్ని రాష్ట్రాల్లో దానినే అమలు చేస్తూ వెళుతూ బలోపేతం అవుతూ వచ్చింది.

ప్రతిపక్షాలను...
ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలను తొలుత బలహీనం చేసి ఆ తర్వాత అధికారం కోసం ప్రయత్నిస్తుంది. హడావిడిగా అధికారం కోసం ఆ పార్టీ ఎన్నడూ వ్యూహాలు రచించదు. ఒకసారి పార్టీ బలపడితే ఇక కొన్నాళ్ల పాటు ఆ రాష్ట్రంలో పాగా వేసేలా దాని స్ట్రాటజీలు ఉంటాయి. ఒడిశా నుంచి తెలంగాణ వరకూ అదే రకమైన వ్యూహంతో వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే స్ట్రాటజీతో వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తూ ఉండివచ్చు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేసి తాను లబ్ది పొందాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లే కనపడుతుంది. త్వరలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
పదవీకాలం కూడా...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ సమయం కూడా పూర్తి కావచ్చింది. ఆయన తర్వాత ఎవరిని నియమించాలన్న దానిపై పెద్దయెత్తున కసరత్తు జరుగుతుంది. జనసేన పార్టీతో పొత్తు ఉండనే ఉంది. కాపు సామాజికవర్గం ఓట్లను ఆ పార్టీ దక్కించుకునే వీలుంది. ఇక రెడ్డి సామాజికవర్గాన్ని ఎటూ వైసీీపీ నుంచి పక్కకు తీసుకురాలేరు. అందుకే కమ్మ సామాజికవర్గం నేతలకు పదవి అప్పగించాలన్న యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు.
అంతా కుదిరితే...
ఈసారి కమ్మ సామాజికవర్గం నేతలను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను హైదరాబాద్ లో కలిశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దగ్గుబాటి పురంద్రీశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగానే రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పురంద్రీశ్వరి అయితే ఇటు కమ్మ సామాజికవర్గం ఓట్లతో పాటు ఎన్టీఆర్ అభిమానుల ఓట్లను కూడా సంపాదించుకోవచ్చన్న ఆలోచనలో ఉంది. టీడీపీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది పక్కన పెట్టి ప్రస్తుతం బీజేపీ నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. అనుకున్నట్లు జరిగితే పురంద్రేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా నియామకం పూర్తయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.


Tags:    

Similar News