ఎక్కడో తేడా కొడుతోంది..!

ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవడంపై భారత రాష్గ్ర సమితికి కాంగ్రెస్‌ రూపంలో పెను సవాళ్లు ఎదురవుతున్నాయా? ఈ ప్రశ్నకు భారాస నేతల్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేసీయార్‌ మిగిలిన పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించినా, పరిస్థితి అంత సానుకూలంగా లేదనే అభిప్రాయం పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు దూకుడు పెంచిన కాంగ్రెస్‌ తీరు వాళ్లను భయపెడుతోంది.

Update: 2023-10-29 13:38 GMT

ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలన్న భారత రాష్గ్ర సమితి ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు జల్లుతోందా? ఈ ప్రశ్నకు భారాస నేతల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇతర పార్టీల కంటే ముందుగానే కేసీయార్‌ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించినా, పరిస్థితి అంత సానుకూలంగా లేదనే అభిప్రాయం పార్టీలో సర్వత్రా వినిపిస్తోంది.  ఆరు హామీలతో దూకుడు పెంచిన కాంగ్రెస్‌ తీరు వాళ్లను భయపెడుతోంది.

రాహుల్‌ గాంధీ సమక్షంలో ప్రకటించిన హామీలు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి హామీలతోనే కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, వెంటనే వాటి అమలుపైనే దృష్టి పెట్టింది. 200 యూనిట్లలోపు వాడకానికి ఉచిత కరెంట్‌, మహిళలకు ప్రతినెలా రెండు వేల రూపాయల నగదు బదిలీ, ఉచిత బస్సు ప్రయాణం లాంటివి... తమ ప్రభుత్వం ఎన్నికలకు వచ్చిన ఆర్నెళ్ల లోగానే కాంగ్రెస్‌ అమలు చేసింది.

తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీల అమలు చేసి తీరుతామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. అర్హులైన మహిళలకు ప్రతీ నెలా 2500 రూపాయల నగదు బదిలీ, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, పదిహేను వేల రూపాయల రైతు భరోసా, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి 250 గజాల ఇంటి స్థలం, ఐదులక్షల రూపాయల నగదు, రైతులకు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీ వంటి హామీలన్నీ ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయాయి. అర్హులైన మహిళలకు పది గ్రాముల బంగారం వంటివి కూడా ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.

పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీగా ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు భారాస ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. మూడేళ్ల కిందట ఆర్టీసీ కార్మికుల సమ్మెను కేసీయార్‌ ఉక్కుపాదంతో అణచివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన ఐదు శాతం మధ్యంతర భృతిపై కూడా వాళ్లు పెదవి విరుస్తున్నారు. నిరుద్యోగుల్లో కూడా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో జరిగిన అవకతవకలపై వాళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఈ వ్యతిరేకతకు... కాంగ్రెస్‌ హామీలు జతగూడితే భారాసకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీయార్‌ మాత్రం కాంగ్రెస్‌ హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నాటకలో ఉచిత కరెంట్‌, అక్కడి విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేస్తోందని, జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ముఖ్యమంత్రి కుర్చీ కోసం నాయకులంతా తన్నుకుంటారని, తెలంగాణలో సుస్థిరత కరువవుతుందని కేటీయార్‌ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భాజపా అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో, ఓట్ల చీలిక పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా భారాసకు ఇబ్బంది పెట్టే అంశమే. ఈ వ్యతిరేక పరిస్థితులను కేసీయార్‌ రాబోయే నెల్లాళ్ళలో ఎలా అధిగమిస్తారో చూడాలి.

Tags:    

Similar News