బుగ్గనను కాపాడేది ఆ ఒక్కటేనట

జగన్ కేబినెట్ లో కీలకమైన పదవిలో ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి. ఆయన కూడా పదవికి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు

Update: 2022-04-08 06:18 GMT

జగన్ కేబినెట్ లో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి. ఆయన కూడా మంత్రి పదవికి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. బుగ్గన అవసరం రానున్న కాలంలో మరింత జగన్ కు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈ మూడేళ్లలో బుగ్గన బుగ్గన పట్టినట్లే అనుకోవాలి. ఢిల్లీలో ఎక్కిన గడప ఎక్కకుండా, దిగిన గడప దిగకుండా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అటు అప్పులతో పాటు ఇటు నిధులను కూడా తేవడంలో కొంత సక్సెస్ అయ్యారు.

జగన్ బటన్ నొక్కడంలో....
ఇటు సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేయాలి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఇందుకు కావాల్సిన నిధులను కేంద్రంతో ఒప్పించి అప్పుల రూపంలోనైనా తెచ్చుకోవాలి. గత ఏడాదిన్నరగా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి మకాం దాదాపు ఢిల్లీలోనేనని చెప్పాలి. ఆయన ఎక్కువ సమయం కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి జగన్ బటన్ నొక్కడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడగలిగారు.
కొత్త వారు వస్తే...
ఇప్పుడు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి స్థానంలో కొత్త మంత్రి ఆర్థికశాఖ బాధ్యతలను చేపడితే మళ్లీ మొదటి కొస్తుంది. కొత్త మంత్రి నిధుల కోసం దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. కొత్త మంత్రి ఆర్థిక శాఖపై పట్టు సాధించి మెలుకువలు నేర్చుకునేలోగా పుణ్యకాలం పూర్తయిపోతుంది. అందువల్ల ఆర్థిక మంత్రిగా కొత్తగా ఎవరు వచ్చినా ఆయనతో పాటు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందునా ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది.
అందుకే పదిలమట....
రానున్న రెండేళ్లలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బటన్ నొక్కడంలో ఇబ్బందులు ఎదురైతే అది అసలుకే ముప్పు తెస్తుంది. అందుకే బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని కూడా వచ్చే కేబినెట్ లో కొనసాగిస్తారని చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బుగ్గనకు ఛాన్స్ దొరుకుతుందని, ఆ జిల్లాలో ఉన్న ఆశావహులకు వేరే కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని జగన్ ఇచ్చే అవకాశముందంటున్నారు. పైసలుతో ముడిపడి ఉన్న బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి పదవి మరి ఏ మేరకు పదిలంగా ఉంటుందన్నది రాబోయే మూడు రోజుల్లో తెలియనుంది.


Tags:    

Similar News