శాసనసభ రద్దు... ఎప్పుడంటే?
కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది
కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో పాటు సిట్టింగ్ లలో ఎక్కువ మందికి టిక్కెట్లు రావన్నది కూడా అంతే నిజం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలో వెల్లడి కావడంతో చాలా మందికి టిక్కెట్లు దక్కవని చెబుతున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా పదవులను ఇస్తామన్న హామీని నేరుగా కేసీఆర్ ఇస్తారట. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది.
వీలయినంత త్వరగా....
అయితే త్వరలోనే తెలంగాణ శాసనసభ సమావేశాలు పెట్టి సభను రద్దు చేస్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. కేంద్ర ప్రభుత్వం రుణాలు పొందడంలో అనుసరిస్తున్న సహాయనిరాకరణ, ఇతర అంశాల్లో తెలంగాణపై వివక్ష చూపడం వంటి అంశాలపై కేసీఆర్ మాట్లాడి, వాటిపై చర్చించిన తర్వాతనే సభను రద్దు చేస్తారన్న టాక్ నడుస్తుంది. అదే జరిగే ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరుగుతాయంటున్నారు. మంత్రి కేటీఆర్ కూడా నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో ఎన్నికలకు సిద్ధమవ్వాలని నేతలకు పిలుపు నివ్వడం ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.
జాతీయ పార్టీని....
ముందుగా జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటిస్తారు. ఈ నెల 18 లేదా 19వ తేదీన పార్టీని కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ లోపే రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా నియమిస్తారు. వచ్చే ఎన్నికలలో గెలవలాంటే అభ్యర్థుల మార్పుతో పాటు ప్రచార వ్యూహాన్ని కూడా త్వరలోనే కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిసింది. శాసనసభను రద్దు చేసి వీలయినంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. లేకుంటే నిధుల లేమితో సంక్షేమ పథకాలను కొనసాగించడం అసాధ్యం.
సిట్టింగ్ లలో ఎక్కువ మందికి...
ఈ నేపథ్యంలోనే త్వరలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తారంటున్నారు. ఈ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలన్న టాక్ పార్టీలో నడుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎలాంటి వ్యతిరేకత ప్రజల్లో లేదని, అయితే ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత ఇబ్బంది పెడుతుందని పీకే టీం సర్వేలో తేలిందంటున్నారు. అందుకే దాదాపు యాభై మంది వరకూ అభ్యర్థులను మార్చే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ విజయం కోసం త్యాగం చేయాలని కూడా త్వరలో కేసీఆర్ పిలుపునివ్వనున్నారని చెబుతున్నారు.