ఒకరిని మించిన వారు మరొకరు
టెక్కలి నియోజకవర్గంలో అభ్యర్థులు ఖరారయ్యారు. దీంతో ఆ నియోజకవర్గంలో వాతావరణం వేడెక్కింది
ఇద్దరూ ఇద్దరే.. నోటి దురుసు వారికున్న నైజం. ఇద్దరినీ స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తుంది. అయినా సరే పార్టీ అధినాయకత్వాలు మాత్రం ఇద్దరికీ టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో పోటీ రసకందాయంలో పడింది. టెక్కలి నియోజకవర్గంలో ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్ప మరెవరూ బరిలోకి దిగరు. అది వాస్తవం. టెక్కలిలో 2014, 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆయన మూడోసారి ప్రయత్నం చేస్తున్నారు.
హ్యాట్రిక్ విక్టరీ కోసం...
అచ్చెన్న వరసగా రెండుసార్లు ఎమ్మెల్యే కావడంతో ప్రజల్లోనూ కొంత అసంతృప్తి ఉంది. ఇక అచ్చెన్నాయుడు టీడీపీ అధ్యక్షుడు అయిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తమపై కేసులు పెడుతున్నా వచ్చి పట్టించుకోవడం లేదని అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో ఆయన అంతటా పర్యటించాల్సి ఉండటంతో టెక్కలిని కొంత నిర్లక్ష్యం చేశారని క్యాడరే చెబుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిలో ఉన్నా పెద్దగా క్యాడర్‌కు అందుబాటులో లేకపోవడం అచ్చెన్నకు మైనస్ పాయింట్ అని అంటున్నారు. అచ్చెన్నకు క్యాడర్ నుంచి పూర్తి సహకారం అందుతుందా? లేదా? అన్నది ప్రశ్న. అచ్చెన్న బుజ్జగిస్తున్నా కొందరు ససేమిరా అంటున్నారట.
దువ్వాడది మరో దారి...
ఇక అధికార పార్టీ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించారు. ఆయనకు కూడా నోటి దురుసు ఎక్కువ. దువ్వాడ శ్రీనివాస్‌ను జగన్ ఎమ్మెల్సీని చేశారు. నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయనకే టిక్కెట్ అనుకున్నారు. కొంత కాలం జిరిగిన బహిరంగ సభలో జగన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అచ్చెన్న, దువ్వాడల మధ్య పోటీ ఉండనుంది. జగన్ ఎమ్మెల్సీగా దువ్వాడను ఎంపిక చేయడంతో అభ్యర్థిత్వంపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అందులో పేరాడ తిలక్ ఒకరు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్‌ను క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈసారి టెక్కలి టిక్కెట్ తనదేననుకున్నారు.
గెలుపు ఎవరదినేది
కానీ వాళ్లిద్దరినీ కాదని జగన్ దువ్వాడ శ్రీనివాస్‌కే జగన్ జై కొట్టడంతో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఒకరినొకరు రేపటి ఎన్నికల్లో సహకరించుకునేంత సీన్ లేదని తెలిసిపోతుంది. అంతే కాదు ఇద్దరిలో ఎవరైనా పార్టీ మారినా మారే అవకాశాలున్నాయంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కేవలం తమ సామాజికవర్గం క్యాడర్‌తోనే సక్రమంగా ఉంటారు. మిగిలిన వారితో అంత సఖ్యత లేకపోవడం టెక్కలి వైసీపీకి మైనస్ అనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఈసారి ఎవరిది విజయం అంటే ఖచ్చితంగా వీరిదేనని చెప్పలేని పరిస్థితుల నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరి చివరకు గెలుపు ఎవరదనేది చూడాల్సి ఉంది.