ఆన్ లైన్ బెట్టింగ్ లో అసలు సూత్రధారి ఎవరు?

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌తో అమాయక ప్రజలను మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు.. ఇప్పటికే [more]

Update: 2020-08-29 02:44 GMT

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌తో అమాయక ప్రజలను మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు.. ఇప్పటికే నలుగురు నిందితులను నాలుగురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ పేరుతో 11 వందల కోట్లు మోసానికి పాల్పడిన అసలు సూత్ర దారులు ఎవ్వరు అన్న కోణంలో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1100 కోట్ల మోసం….

దేశంలోని యువత ను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియా వేదిక గా కోట్ల రూపాయల ఆన్ లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న అంతర్జాతీయ మాఫియా గుట్టు రట్టు చేశారు సీసీఎస్ పోలీసులు. ఆన్ లైన్ బెట్టింగ్ తో మోసపోయిన వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులకు దర్యాప్తు జరిపి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితులను నాలుగురోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. 11 వందల కోట్ల పైన జరిగిన ఆన్ లైన్ బెట్టింగ్ స్కాం పై నిందితుల నుండి సీసీఎస్ పోలీసులు వివరాలు సేకరించారు. ఈ కేసులో తాము మధ్యవర్తిత్వం మాత్రమే వ్యవహరించామని ఇందులో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు యజమానులు ఎవ్వరో తమకు తెలియదని ఢిల్లీ నుండి తమకు ఈ గేమ్స్ షోలను ఎలా నిర్వహించాలో, డబ్బుకు ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలో మాత్రమే చెప్పేవారని, అలా చేసినందుకు తమకు వేతనాలు , కమీషన్లు ఇచ్చే వారని నిందితులు తెలిపినట్టు సమాచారం. నిందితులు చెప్పిన వివరాలను సేకరించిన పోలీసులు ఈ కేసులో కీలక వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు.

చైనాకు తరలి వెళ్లిన సొమ్ము…..

నాలుగు రోజుల కస్టడీ లో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా ఎక్కడి నుండి నడిపిస్తున్నారు.. యూత్ ను ఏ విధంగా ఈ గేమ్ లోకి దింపుతున్నారు.. డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, వీటిని ఎవరికి చేర వేస్తున్నారు అనే దానిపై సీసీఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు రోజుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితులను నలుగురిని నాంపల్లి కోర్టులో హాజరుపరచారు. అనంతరం నలుగురు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు చంచల్ గూడా జైలుకు తరలించారు పోలీసులు .నాలుగు రోజుల విచారణ లో చైనా కి చెందిన నింగ్ యాంగ్, డింగ్ యాంగ్, లింగ్ లింగ్ యాంగ్, యాన్ హౌ అనే మరో నలుగురు నిందితులు ఈ స్కాం లో ప్రధాన సూత్రధారులని పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.. ఈ కేసులో పూర్తి వివరాల తెలుసు కోవడం కోసం నలుగురు నిందితులను మరోసారి కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆన్ లైన్ గేమ్ లో దాదాపు1107 కోట్లు బెట్టింగ్‌ రూపంలో వసూలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందులో రూ.110 కోట్లు చైనాకు తరలిపోయినట్లు పోలీసులు గుర్తించారు .ఇందులో 30 కోట్ల రూపాయలు అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగతా రూ.967 కోట్లు ఎక్కడికి వెళ్లాయి అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. హవాలా ద్వారా ఈ డబ్బు ఇతర దేశాల మీదుగా చైనాకు తరలినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా ఈడీ, ఐటి శాఖ కు విదేశాల కు వెళ్లిన డబ్బుల పై ఆరా తీస్తుంది.

Tags:    

Similar News