డిసెంబర్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయా? ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే..

Update: 2023-07-05 15:34 GMT

early elections in ap

మోడీ కూడా ముందస్తుకు సై?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రలో వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయా? ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తాము కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటన ‘ముందస్తు’ సంకేతాలను ఖాయం చేసిందని చెబుతున్నాయి.

ఢిల్లీ  పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం జగన్‌ తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. అక్కడ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. తర్వాత మోదీని కలిసిన జగన్‌ దాదాపు గంటన్నర వివిధ విషయాలపై చర్చించారు. పోలవరం, రాష్ట్రానికి నిధులు, పెండింగ్ పనులు వంటివన్నీ చర్చించినట్లు బయటకు చెబుతున్నా ముందస్తు ఎన్నికలపై కూడా ఇద్దరి నేతల మధ్యా చర్చ జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది.

ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే భాజపా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పూర్తిగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భాజపా శ్రేణులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఈ లోగా ఉమ్మడి పౌరస్మృతిని పార్లమెంట్‌లో ఆమోదించి ఎన్నికలకు వెళ్లాలని భాజపా అధినాయకత్వం భావిస్తోంది. దీనివల్ల మళ్లీ హిందూ ఓట్లను పూర్తి స్థాయిలో సంపాదించుకోవచ్చని భావిస్తోంది. ఈ చట్టంపై కూడా లోక్‌సభలో, రాజ్య సభలో వైకాపా మద్దతు కోరినట్లు తెలిసింది.

ఇక జగన్‌ కూడా ముందస్తుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 99.5 శాతం నెరవేర్చినట్లు ప్రకటించిన జగన్‌, ఆ విశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తిని తొలగించేలా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, సీపీఎస్‌ స్థానంలో గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌లాంటి ప్రకటనల ద్వారా జగన్‌ ఆ వర్గాల ఓట్లపై కూడా నమ్మకంగా ఉన్నారు. మునుపెన్నడూ, ఏ ముఖ్యమంత్రి చేయని స్థాయిలో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చామని, తమ గెలుపు నల్లేరు మీద నడకేనని వైకాపా శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల రెండు ప్రముఖ మీడియా సంస్థలు తమ సర్వేల్లో ఆంధ్రలో వైకాపా అధికారంలోకి వస్తుందని ప్రకటించడం కూడా జగన్‌ నమ్మకానికి కారణమని తెలుస్తోంది. మొత్తం మీద కేంద్రం, రాష్ట్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ విషయం పై స్పష్టత రానుంది. 

Tags:    

Similar News