నిద్ర పట్టడం లేదా..? 3-2-1 ప్రయత్నించండి
నిద్ర పట్టకపోవడం అనేది ఈ తరానికి ఓ శాపంగా మారింది. పని వత్తిడి, మానసిక, శారీరక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది నిద్రమీద విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్య నలభై ఏళ్లు దాటిన వాళ్లలో ఎక్కువగా ఉంటోంది. కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకూ నిద్ర పోవడం వల్ల చాలా జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సుఖనిద్రకు ఉన్న అనేక పద్ధతుల్లో 3, 2, 1 అనేది ఒకటి. నిద్రకు 3 గంటల ముందు భోజనం ముగించాలి. రెండు గంటల ముందు కావలసినన్ని నీళ్లు తాగాలి. శరీరంలో అవసరమైనంత నీటి శాతం ఉండటానికి ఇది చాలా ప్రధానం. ఓ గంట ముందు స్క్రీన్స్‌ను చూడటం మానేయాలి. మొబైల్, టీవీ, కంప్యూటర్ ఏదైనా కావచ్చు. ఆ డిజిటల్ మాయ నుంచి బయటపడాలి. ఆ గంటలో మంచి పుస్తకాన్ని చదవండి. లేదా ప్రశాంతమైన సంగీతాన్ని వినొచ్చు.
శరీరాన్ని రిలాక్స్ చేస్తూ నిద్రకు ఉపక్రమించాలి. నిద్రకు చేటు చేసేది ఆలోచనలే. మెదడు తీగె లాగితే డొంకంతా కదులుతుంది. ఎక్కడో మొదలయ్యే ఆలోచన మరెక్కడికో వెళ్లిపోతుంది. ఆ ప్రవాహాన్ని ఆపడం కష్టం. దానికి బ్రేక్ వేయాలంటే ఓ చిన్న మెడిటేషన్ లాంటిది చేయాలి. ‘నేను ఆలోచించను లేదా నేను ఆలోచించడం లేదు...’ అని ఓ పదిసార్లు అనుకోవాలి. వీలైతే ఎక్కువసార్లు కూడా మనసులో అనుకోవచ్చు. దీనివల్ల కాసేపటికే నిద్రలోకి జారుకోవచ్చు. కంటి నిండా కునుకు రావడానికి మరో మార్గం కూడా ఉంది. వంద నుంచి వెనకకు అంకెలు లెక్కబెట్టుకోవాలి. దీనివల్ల కూడా ఆలోచనలను ఆపవచ్చు. నిద్రా దేవి కరుణను పొందవచ్చు.