ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఆయన శ్రీకాకుళం లో కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో పాల్గొని ప్రసంగించారు. తమ్ముళ్లూ బీజేపీపై పోరాటానికి మీరు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏ రకంగా సాయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసిందన్నారు. విభజనతో సమస్యలు ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోకపోగా, సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లుతోడయ్యారన్నారు. వీరందరూ కలసి తనపై యుద్ధానికి వస్తున్నారు. అయినా తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని, తనకు ప్రజల సంక్షేమమే ముఖ్యమనిచెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే బీజేపీని గద్దె దించడమే మార్గమన్నారు. అందుకే తాను 36 ఏళ్లు విభేదించిన కాంగ్రెస్ తో జతకట్టాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఎంపీలు పార్లమెంటులో నోరెత్తితే ఆదాయపుపన్ను శాఖ చేత దాడులు చేయిస్తున్నారన్నారు.కోడి కత్తి పార్టీని అసలు నమ్మవద్దని వైసీపీపైన ఆయన విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా సాధించేంత వరకూ తాను నిద్రపోనని బాబు చెప్పారు.