సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ.. రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా ?
దిశ చట్టం అమల్లో ఉంటే ఇప్పటివరకూ ఎన్నికేసులు నమోదు చేశారు ? ఎంతమందికి న్యాయం చేశారు ? ఎందరిని కాపాడారు ?
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార ఘటన తర్వాత.. సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ లేఖలో విమర్శించారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, అరాచకాలు ఎక్కువయ్యాయని, అందుకు కారణం ప్రభుత్వం ఉదాసీనతేనని దుయ్యబట్టారు. కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే.. వారు పట్టించుకోకపోవడం అమానుషమన్నారు. బాధితురాలిపై అత్యాచారం ఎప్పుడు జరిగిందో హోంమంత్రికి తెలియకపోవడం బాధాకరమన్న ఆయన.. రాష్ట్రంలో అసలు దిశ చట్టం అమల్లో ఉందా అని ప్రశ్నించారు.
దిశ చట్టం అమల్లో ఉంటే ఇప్పటివరకూ ఎన్నికేసులు నమోదు చేశారు ? ఎంతమందికి న్యాయం చేశారు ? ఎందరిని కాపాడారు ? చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారం చేసిన నిందితులను ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదొక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ అసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు.
జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు నేరాలు మన రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం అన్నారు. మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపు ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రాజకీయాల కోసం పోలీస్ వ్యవస్థను వాడుకోవడం ఆపి.. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించాలని సూచించారు.