బాబూ.. పవన్ కు ఆ సీన్ లేదా?

ఉత్తరాంధ్ర పర్యటనలో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు. కానీ సీమలో మాత్రం ఆయన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళుతున్నారు

Update: 2022-07-10 06:03 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మహానాడుల పేరుతో జిల్లాలను పర్యటిస్తున్నారు. బాదుడే బాదుడంటూ జనం మధ్యకు వెళుతున్నారు. పార్టీ క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నారు. నేతలను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వేడిని రగిలిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మినీ మహానాడులో చేసేది రొటీన్ ప్రసంగం అయినా ఆయన నియోజకవర్గా సమీక్షలో కొంత వెరైటీ గా వ్యవహరిస్తున్నారు.

మినీ మహానాడులంటూ...
చంద్రబాబు మినీ మహానాడులను ఇప్పటి వరకూ అనకాపల్లి, విజయనగరం, కడప, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. సరే.. కార్యక్రమానికి హాజరువతున్నది జనమా? జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల కార్యకర్తలా? అన్నది పక్కన పెడితే సభలకు, రోడ్ షోలకు భారీ జనసమీకరణే కన్పిస్తుంది. దీంతో చంద్రబాబు మహానాడుతో పాటు మినీ మహానాడులు సక్సెస్ అవుతున్నాయని భావించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు.
సమీక్షల సందర్భంగా...
సరే చంద్రబాబు రోడ్ షోలు.. సభలు సక్సెస్ అవుతున్నాయా? లేదా? అన్నది ఇక్కడ ప్రధాన అంశం కాదు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలనుకుంటున్నారా? లేదా? అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. సభలు, రోడ్ షో లకంటే నియోజకవర్గాల సమీక్షల్లో బాబు నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనప్పుడు ఎలాంటి నిర్ణయాలు లేవు. కానీ సీమలో మాత్రం ఆయన నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో చంద్రబాబు పొత్తుకు వెళతారన్నది ఏపీ పాలిటిక్స్ తెలిసిన వారెవరైనా చెబుతారు. ఈసారి సింగిల్ గా వెళ్లే ప్రయోగం చంద్రబాబు చేయరన్నది అందరి మాట.
ఉత్తరాంధ్రలో మాత్రం...
అలాంటి తరుణంలో ఉత్తరాంధ్ర పర్యటనలో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించలేదు. కానీ సీమలో మాత్రం ఆయన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళుతున్నారు. డోన్ లో సుబ్బారెడ్డి, రాజంపేట, కడప పార్లమెంటుకు గంటా నరహరి, శ్రీనివాసులురెడ్డి, పుంగనూరు చల్లా బాబు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్లను ప్రకటించారు. అంటే పొత్తులతో కాకుండా చంద్రబాబు సింగిల్ గా వెళ్లాలనుకుంటున్నారా? లేదా? సీమలో జనసేనకు బలం లేదని భావిస్తున్నారా? అన్నది తెలియడం లేదు. బీజేపీతో ఒకవేళ పొత్తు కుదిరితే రాజంపేట ఎంపీ స్థానాన్ని కోరుకుంటుంది. మరి బీజేపీని తాను వద్దను కుంటున్నారా? లేక బీజేపీయే తనను దగ్గరకు రానివ్వదని భావించి ఈ ప్రకటనలు చేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద చంద్రబాబు పర్యటనల్లో ప్రకటనలతో పార్టీ నేతలే విస్తుబోతున్నారు.


Tags:    

Similar News