భాజపా అవుట్! చంద్రబాబు ప్లాన్ బి..?
తెలుగు దేశం అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీపై ఆశలు వదిలేసుకున్నారా? మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు భారతీయ జనతా పార్టీపై ఆశలు వదిలేసుకున్నారా? మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ అండ తనకు అవసరం అని ఆయన భావిస్తున్నారు. కమలం పార్టీ తనను నిరాకరిస్తే, కాంగ్రెస్ పంచన చేరేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు భాజపాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఆ సమయంలో ప్రతిపక్షాలతో ఉమ్మడి కూటమి ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిపక్ష పార్టీల సభల్లో పాల్గొన్నారు. భాజపా ఓడిపోతుందనే ధీమాలో ఆయన అలా చేశారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగు దేశం, కేంద్రంలో ప్రతిపక్షాల ఘోర ఓటమి తర్వాత... మోదీ కరుణా కటాక్షం కోసం తెలుగుదేశం అధినేత చేయని ప్రయత్నం లేదు. అయినా పెద్దగా ఫలితం దక్కలేదు.
2024 ఎన్నికలు వచ్చేస్తున్నాయి. భాజపా తనను సంకీర్ణ భాగస్వామిగా ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియదు. ఈ సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా బ్లాక్‌గా ఏర్పడ్డాయి. అవి తెలుగుదేశాన్ని పట్టించుకోవడం మానేశాయి. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు భాజపాకు దగ్గర కావడానికి ప్రయత్నించడంతో, కీలకమైన ప్రతిపక్షాలన్నీ బాబు ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో బాబు ప్లాన్ బి ని రెడీ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు దగ్గర కావడం ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లోపాయికారీగా మద్దతిస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్‌కి పడితే, ఆ పార్టీ గెలుపు ఈజీ అవుతుంది. కీలకమైన తెలంగాణపై పట్టు సాధిస్తే, 2024 ఎన్నికల్లో భాజపా ఓడిపోతే... కేంద్రస్థాయిలో మళ్లీ చక్రం తిప్పే అవకాశం తనకు లభిస్తుంది. ఇదీ బాబు ప్లాన్.
జగన్ తనపై వరుసగా కేసులు పెడుతుండటంతో బాబుకు ఇప్పుడు కేంద్రం అండ అవసరం. తాను ఎంత చేరువ అవుతున్నా భాజపా నుంచి తనకు ఎలాంటి రక్షణ అందడం లేదు. అందుకే ఆయన హస్తానికి స్నేహ హస్తం అందిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఆంద్రలో కూడా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించే ఆలోచనలో తెలుగుదేశం అధినేత ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో ఇలా ఆలోచించే ఆయన దెబ్బతిన్నారు. ఈసారి ఆయన ప్లాన్ ఎంతవరకూ వర్కౌవుట్ అవుతుందో చూడాలి.