జూ"నియర్" కోసం ... నిజమేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు తన ఇగోను పక్కనపెట్టి ఈ మూడేళ్లలో కొంత వెనక్కు తగ్గుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు గెలుపు అవసరం
చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంత ఇటీవల కాలంలో తగ్గుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఆయనకు గెలుపు అవసరం. పార్టీ మనుగడకు కూడా అత్యవసరం. అందుకే చంద్రబాబు తన ఇగోను పక్కనపెట్టి ఈ మూడేళ్లలో కొంత వెనక్కు తగ్గుతున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన అధీనంలోకి తీసుకున్న తర్వాత ఎప్పుడూ వెనక్కు తగ్గలేదు. ఈసారి మాత్రం ఆయనలో బయటకు కనపడని భయం కన్పిస్తుంది. ఓటమి అనే పదాన్ని ఆయన ఊహించుకోలేకపోతున్నారనిపిస్తుంది. అందుకే ప్రతి సందర్భంలో ఆయనలో ఫ్రస్టేషన్ కన్పిస్తుంది.
చెక్కు చెదరని ధైర్యంతో...
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపిించినప్పుడు కూడా చంద్రబాబు డోన్ట్ కేర్ అనే ధోరణని వ్యవహరించారు. 2004 నుంచి 2014 వరకూ ఆయన అధికారానికి దూరంగా ఉన్నా ఆయనలో ధైర్యం చెక్కు చెదరలేదు. నేతలు పార్టీని వీడి వెళుతున్నా పట్టించకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పవర్ ను సొంతం చేసుకోగలిగారు. చంద్రబాబు విజయానికి బీజేపీ, జనసేన మద్దతు అన్న కారణాలను పక్కన పెడితే ఆయన సమర్థత, విజన్ ను చూసి ప్రజలు ఓటేశారనే చెప్పాలి.
అందరినీ పక్కన పెట్టి...
ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా లెక్క చేయలేదు. హరికృష్ణను పక్కన పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా 2014 ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించలేదు. తాను ఒక్కడే అనుకున్న ప్రకారం ముందుకు వెళ్లారు. తన వియ్యంకుడు బాలకృష్ణను మినహాయించి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పట్టించుకోలేదనే చెప్పాలి. కుమారుడు లోకేష్ రాజకీయ భవిష‌్యత్ గురించి ఆలోచించారు తప్పించి మరో ఆలోచన చేయలేదు.
ఎన్టీఆర్ కుటుంబాన్ని...
కానీ 2019 ఎన్నికల్లో ఓటమి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఆలోచనల్లో మార్పు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం పెట్టే టార్చర్ కు ఆయన తగ్గక తప్పడం లేదు. ఎన్టీఆర్ కుటుంబాన్ని దరి చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తాను పార్టీని చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి శత్రువుగా భావించే దగ్గుబాటి కుటుంబానికి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య ఒక వివాహ వేడుకలో కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల ఆయనకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరితే వెళ్లి పరామర్శించి వచ్చారు. తనకు తొలి నుంచి శత్రువుగా ఉన్న దగ్గుబాటిని దగ్గరకు తీసుకున్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా త్వరలో వెళ్లి కలిసే అవకాశముంది.
వారి సహకారం కోసం..
పార్టీలో చోటు ఇవ్వకపోయినా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ తనకు వ్యతిరేకం కాకూడదన్న ధోరణిని చంద్రబాబు ఈ మధ్య కాలంలో ప్రదర్శిస్తున్నారు. రానున్న కాలంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను పార్టీ ప్రచారానికి వినియోగించుకునే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నట్లు కనపడుతుంది. అందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాకపోవచ్చు. ఆయన దగ్గరకు స్వయంగా చంద్రబాబు వెళ్లి ప్రచారానికి రావాలని కోరే అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. ప్రతిచోటా టీడీపీ కార్యకర్తల నుంచి జూనియర్ నినాదం విన్పిస్తుండటం ఇందుకు కారణం కావచ్చు. అందుకు జూనియర్ అంగీకరిస్తాడా? లేదా? అన్నది పక్క పెడితే బాబు ప్రయత్నాలు ఆ దిశగానే సాగుతాయన్నది వాస్తవం.