పవన్ బాబుకు బలమా? బలహీనమా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు. జనసేనతో పొత్తుతో వెళ్లాలనుకుంటున్నారు
గణాంకాలు విచిత్రంగా ఉంటాయి. మామూలుగా 1+1 రెండు. కానీ రాజకీయాల్లో ఈ లెక్క వేరవుతుంది. రాజకీయాల్లో లెక్కలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. 1+1 పదకొండు కావచ్చు. ఒక్కోసారి జీరో కావచ్చు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ప్లస్సా? మైనస్సా? అన్నది తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలయింది. అయితే జీరో పక్కన ఏ అంకె వచ్చి చేరినా గణాంకాల్లో పెరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి అని మరికొందరు భావిస్తున్నారు.
ఒంటరిగా...
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పాటు జనసేన పార్టీని కలుపుకుని వెళ్లాలన్న యోచనలో ఉంది. బీజేపీ కూటమిలోకి వస్తే అభ్యంతరం లేదు. రాకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు అన్న ధోరణిలో ఉంది. జనసేనను మాత్రం ఆహ్వానించడానికే రెడీ అయింది. అయితే పవన్ కల్యాణ్ తో పొత్తు వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అభిమానులు ఓకే...
పవన్ కల్యాణ్ ది నిలకడలేని స్వభావం. ఇప్పటికి అనేక సార్లు పార్టీల జెండాలను మార్చారు. అయితే పవన్ కు ఏపీలో అభిమానులు కొండంత బలంగా ఉన్నారు. అభిమానుల ఓట్లే ఆయనను రాజకీయంగా ఇప్పటి వరకూ కాపాడుకుంటూ వస్తున్నాయి. యువత ఓట్లు రాబట్టుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు సయితం అంచనా వేస్తున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓట్లు మాత్రం పవన్ కల్యాణ్ తెచ్చుకునే అవకాశాలపై మాత్రం టీడీపీలో అనుమానాలున్నాయి.
కాపు సామాజికవర్గంలోనే?
కాపులు గంపగుత్తగా పవన్ వెంట నడవరు. స్థానిక అభ్యర్థులు, పరిస్థితులను బట్టి వాళ్లు ఓట్లు వేస్తారు. పవన్ ను తమ చెంతకు చేర్చుకోవడం ద్వారా బీసీలు మరింత దూరమయ్యే అవకాశముందన్న విశ్లేషణలు లేకపోలేదు. బీసీలు ప్రస్తుతం వైసీపీ వైపు చూస్తున్నారు. తమకు మొన్నటి వరకూ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను పవన్ ను దగ్గర చేర్చకోవడం ద్వారా దూరం చేసుకోవడం ఎందుకన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబుకు పవన్ బలమా? బలహీనమా? అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతుంది.