చంద్రన్నకు చాదస్తం ఎక్కువయిందా?
చంద్రబాబు బాగా ఓపిక ఉన్న నేత. అప్పుడప్పుడు సహనం కోల్పోయినా రాజకీయాల్లో దూరాలోచన చేయగలిగిన లీడర్ గా పేరుంది.
చంద్రబాబు బాగా ఓపిక ఉన్న నేత. అప్పుడప్పుడు సహనం కోల్పోయినా రాజకీయాల్లో దూరాలోచన చేయగలిగిన లీడర్ గా పేరుంది. అదీ జగన్ విషయంలోనే ఆయన బరస్ట్ అవుతారు. మరే విషయంలోనూ ఆయన ఇంచ్ కూడా ఫ్రస్టేషన్ చూపించరు. అది బీజేపీ విషయంలో కావచ్చు. ఇతర పార్టీల పైన కావచ్చు. కాంగ్రెస్, బీజేపీలను విమర్శించడం చంద్రబాబు ఎప్పుడో మానేశారు. ఇప్పుడు వైసీపీని ఒంటరి చేసి తాను తిరిగి సీఎం గద్దెనెక్కడమే ఏకైక లక్ష్యం. అయితే వయసు ప్రభావం చంద్రబాబులో అప్పుడప్పుడు కన్పిస్తుంది. అంతా తన వల్లే జరిగిందన్న భ్రమను కల్పించే ప్రయత్నంలో అప్పుడప్పుడు ఆయన అభాసుపాలవుతున్నారు కూడా.
అల్లూరి విగ్రహాన్ని...
అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని తానే పెట్టమని చెప్పాననడం ఈ కోవలోకి చెందినదే. ప్రజలకు రూఢీగా తెలిసిన విషయాన్ని కూడా ఆయన అలవోకగా చెప్పేస్తారు. అందువల్లనే పెద్దాయనపై సోషల్ మీడియాలో ఎక్కువగా సెటైర్లు వినిపిస్తుంటాయి. అక్కడ క్షత్రియ సమాజం అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు మూడు కోట్ల రూపాయలను వెచ్చించింది. అయితే దీనిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా హైజాక్ చేసింది. రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ ఎటూ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అల్లూరి విగ్రహం ఐడియా తానే ఇచ్చానని చెెప్పి మరోసారి నవ్వుల పాలయ్యారు.
ముందు చూపున్న నేతే...
చంద్రబాబు సమర్థత అందరికీ తెలిసిందే. కొంత ముందు చూపు ఉన్న నేత. అందులో తన స్వార్థం ఉన్నా అది పైకి కన్పించకుండా అబివృద్ధిని మాత్రం చేస్తారని ఆయన ప్రత్యర్థులు సయితం అంగీకరిస్తారు. ఇక రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు కావస్తున్నా హైదరాబాద్ జంట నగరాలను అభివృద్ధి చేసింది తానేనని అవకాశమొచ్చిన ప్రతి సారీ చెప్పుకుంటారు. దానిని ఎవరూ కాదనరు. అందులో వాస్తవం ఉంది. కాని, పదే పదే చెప్పకోవడంతో చంద్రబాబును అనేకమంది చాదస్తపు నేతగా చూస్తారనడం కూడా అంతే వాస్తవం.
అధికారంలో ఉన్నప్పుడు....
ఇక అమరావతి రాజధాని విషయంలోనూ గొప్పులు చెప్పుకుని తిప్పల పాలవుతుంటారు చంద్రబాబు. రాజధానిని మరో సింగపూర్ గా మారుస్తారంటారు. దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతారంటారు. అధికారంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చి పోతారు. తాను చేయాల్సిన పనులు మాత్రమే చేస్తుంటారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును జనం అతి దగ్గరగా గమనించారు. ఆయన ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా చాదస్తంగానే చూస్తారు తప్ప నమ్మరన్నది విశ్లేషకుల మాట. చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోరు. తాను చెప్పదలచుకున్న మాటను నేరుగా చెప్పేస్తారు. అప్పుడప్పుడు అభాసుపాలవుతుంటారు. అల్లూరి విగ్రహం సంఘటన మాదిరిగానే.