రాష్ట్ర ప్రయోజనాల కోసమే ధర్మపోరాటాన్ని ప్రారంభించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు లో జరిగిన ధర్మ పోరాట దీక్ష సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అడ్రస్ గల్లంతవుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అయితే రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని గ్రహించిన తర్వాత దానిని తెగదెంపులు చేసుకున్నామని వివరించారు.
ఒక్క ఓటు కూడా రాదు......
వచ్చే ఎన్నికలలో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించలేదని వాపోయారు. శంకుస్థాపన రోజునే మట్టి, నీళ్లు తెచ్చి తన మనసులో మాటను ఆనాడే మోదీ బయట పెట్టుకున్నారన్నారు. ప్రపంచదేశాలు అబ్బురపడేలా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఏకం చేస్తానని, ఆ పార్టీని మట్టి కరిపిస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పినందుకే కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు సిద్ధమయ్యాయనని చంద్రబాబు వివరించారు.