Chandrababu : జగన్ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావడం లేదు

36 గంటల దీక్షను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విరమించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలు తాగుతుంటాడని [more]

Update: 2021-10-22 14:56 GMT

36 గంటల దీక్షను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విరమించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలు తాగుతుంటాడని అన్నారు. అలాంటి సీనియర్ ని అయిన తనను అవమానించే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారారని అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ బూతులు మాట్లాడలేదన్నారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పిన జగన్ చివరకు నాసిరకమైన మద్యం బ్రాండ్లను తన అనుచరుల చేత తయారు చేయించి అమాయకులకు అంటగడుతున్నారన్నారు.

దాడులు చేస్తూ….

డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడులు జరుగుతున్నా పట్టించుకో లేదన్నారు. లోకేష్ హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ పోలీసులుపై దాడులు చేసినట్లు కేసులు నమోదు చేశారని చంద్రబాబు అన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రగ్స్ పై సమీక్షలు చేస్తుంటే, జగన్ ఇక్కడ టీడీపీ నేతలపై దాడులు ఎలా చేయాలన్న దానిపై సమీక్ష చేస్తుంటారన్నారు. పట్టాభి ఏదో ఒక మాటంటే తల్లిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

చివరకు తల్లి, చెల్లిని కూడా….

జగన్ తల్లిని, చెల్లిని రాజకీయంగా తనకు ఉపయోగించుకుంటారే కాని, కనీసం వారికి జగన్ న్యాయం చేయరని చంద్రబాబు అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా జయం మనదే అని చంద్రబాబు అన్నారు. పోలీసులకు తాము భయపడే ప్రసక్తి లేదని అని అన్నారు. 1984లోనే ఆగస్టు సంక్షోభాన్ని కార్యకర్తలు తిప్పికొట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పరిటాల రవిని హత్య చేసినప్పుడు అసెంబ్లీ తన విశ్వరూపం చూపించానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని భయపెట్టానని చంద్రబాబు అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులపై పోరాడిన తనకు జగన్ ఒక లెక్క కాలేదన్నారు. జగన్ క్యారెక్టర్ తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. తాను ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇరిగేషన్ గురించి జగన్ కు ఓనమాలు కూడా తెలియవని, పోలవరం ఇప్పటివరకూ పూర్తి చేయలేకపోయారన్నారు. అమరావతిని నాశనం చేశారన్నారు. రెండు లక్షల కోట్ల అభివృద్ధి ఆవిరై పోయిందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఈపోరాటం ఈరోజు తో ఆగదని, కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు దీక్షను మహిళ నేతలు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. వంగలపూడి అనిత, పంచుమర్తి అనూరాధలు దీక్షను విరమింప చేశారు.

Tags:    

Similar News