చంద్రబాబు కొత్త స్ట్రాటజీ.. పొత్తుల కోసం..
చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయిన తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే రెండో దఫా జరిగిన ఎన్నికల్లోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఒంటరిగా బరిలోకి దిగి ఆయన చేయి కాల్చుకున్నారు. దారుణ ఓటమిని చవి చూశారు. ఈసారి ఆయన గెలుపు కోసం అన్ని రకాలుగా కసరత్తులు మొదలు పెట్టారు. మరో వైపు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యం ఆయనకు ఉన్నా అది సాధ్యపడటం కష్టమే. అక్కడ పార్టీ పూర్తిగా పడకేసింది.
అసెంబ్లీలో ప్రాతినిధ్యం...
కానీ ఖమ్మం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కనీసం అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నట్లుంది. పార్టీకి తెలంగాణలో కొంత గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని స్థానాల్లోనైనా గెలవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆయన ఖమ్మం జిల్లాను ఎంచుకున్నట్లు కనపడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ఖమ్మం జిల్లాలో అయితేనే కొన్ని సీట్లయినా సాధించవచ్చన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. ఎక్కువగా అక్కడ ఏపీ నుంచి వలస వెళ్లి సెటిల్ అయిన వారు ఎక్కువ మంది ఉండటం కూడా కలిసి వచ్చే అంశమే.
గత ఎన్నికలలోనూ...
2018 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి రెండు స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఆ తర్వాత వారిద్దరూ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారనుకోండి అది వేరే విషయం. అయినా చంద్రబాబుకు ఆశంతా ఖమ్మం జిల్లాపైనే పెట్టుకున్నారు. ఇక్కడ అయితేనే ఒకటి, రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన భద్రాచలం పర్యటనకు కూడా కొంత స్పందన రావడంతో చంద్రబాబు డిసైడ్ అయినట్లే కనిపిస్తుంది. అయితే ఖమ్మం జిల్లా సభ వరకే ఆయన పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకు మించి ఆయన తెలంగాణలో పార్టీకి పెద్ద సమయం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు.
పొత్తుల కోసమేనా?
సెప్టంబరు నెలలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అది సక్సెస్ చేసుకుంటే కొన్ని పార్టీలైనా తమ పార్టీతో పొత్తులకు ముందుకు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. బీజేపీ తోనే ఆయన కలసి తెలంగాణలో వెళ్లాలని భావిస్తున్నారు. తెలంగాణలో మొదలు పెడితే ఏపీలో కూడా కంటిన్యూ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే ఖమ్మం సభకు కేవలం తెలంగాణ నుంచి కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయించే ఆలోచనలో ఆయన ఉన్నారు. అప్పుడే తెలంగాణలో పార్టీకి ఒక విలువ, గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఆయన అంచనా ఏమేరకు సఫలం అవుతుందో చూడాలి.