ఢిల్లీ డోర్స్ ఓపెన్... బాబు టూర్ సక్సెస్

తెలుగుదేశం అధినే చంద్రబాబు లక్ష్యం నెరవేరింది. చాలా రోజుల తర్వాత ఆయన జరిపిన ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి.

Update: 2022-08-08 07:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినే చంద్రబాబు లక్ష్యం నెరవేరింది. చాలా రోజుల తర్వాత ఆయన జరిపిన ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆయన ఆజాదీకా అమృతోత్సవ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లినా అసలు కార్యం వేరే ఉంది. ప్రధానంగా బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకోవాలన్నది ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. ప్రధాని మోదీ, అమిత్ షాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వెళితే అపాయింట్‌మెంట్ దొరకొచ్చు. దొరకకపోవచ్చు. కానీ వారి ఆహ్వానం పంపిన సమావేశానికి హాజరయితే కొంత సానుకూలతను పొందే వీలుంటుంది.

వీలయితే రెండు మాటలు...
వీలయితే రెండు మాటలు.. అన్నట్లు ఛాన్స్ దొరికినా చాలు. అది దొరికింది. చంద్రబాబుతో మోడీ మాట్లాడారు. ఐదు నిమిషాలు కావచ్చు. ఒక నిమిషం కావచ్చు. అది చాలు బాబుకు. చంద్రబాబుకు ఆ మాత్రం అవకాశం లభిస్తే చాలు. రాజకీయాల్లో ఉథ్థానపతనాలను చూసిన ఆయన అవకాశాన్ని జారవిడ్చుకోరు. ఆ సమావేశంలో మోదీ చంద్రబాబు వద్దకు వచ్చి మరీ పలకరించారు. అది చాలు ఆయన అనుకూల పత్రికలు తరచూ ఢిల్లీ రావాలని మోదీ కోరారని వార్తలు ప్రచురించాయి. అందులో నిజానిజాలు పక్కన పెడితే ఇంకోసారి ఢిల్లీ వెళితే సులువుగా చంద్రబాబుకు మోదీ అపాయింట్‌మెంట్ లభించే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయి.
త్వరలోనే మళ్లీ....
ఆయన త్వరలోనే మళ్లీ ఢిల్లీ పర్యటన చేసే అవకాశాలను కొట్టి పారేయలేం. ఎందుకంటే మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్ దొరికితే జగన్ ను ఇరుకున పెట్టొచ్చు. మైండ్ గేమ్ స్టార్ట్ చేసే వీలుంది. జగన్ తన ట్రాప్ లో పడి తాను చేసినట్లే మోదీకి జగన్ దూరమయ్యే అవకాశాల కోసం ఆయన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత వరకూ సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఆ సంకేతాలు అందుతున్నాయి. పవన్ కల్యాణ్, బీజేపీ, టీడీపీ కలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వీలుంది.
తన అవసరం ....
ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ కష్టాల్లో ఉంది. సొంతంగా పార్లమెంటు స్థానాలను గెలుచుకునే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ ను నమ్ముకుని ఎన్నికల గోదాలోకి దిగితే పుట్టిమునిగినట్లే. తమకంటూ కొన్ని స్థానాలు బీజేపీకి కావాలి. జగన్ బీజేపీతో నేరుగా కలిసే అవకాశం లేదు. బయటనుంచి మద్దతు ఇవ్వవచ్చేమో కాని, పొత్తుకు ముందుకు రారు. ఈ ఈక్వేషన్లు తనకు కలసి వస్తాయని చంద్రబాబుకు తెలుసు. అలాగే తనకూ బీజేపీ అవసరం చాలా ఉంది. అందుకే బీజేపీ కేంద్రం పెద్దలు కూడా తనతో మరోసారి పొత్తుకు సిద్ధపడతారని ఆయన వేసిన అంచనా నిజ రూపం దాల్చే వీలుంది. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగానే విజయవంతం అయిందనే టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Tags:    

Similar News