జోగయ్య హడావిడి అందుకేనట
చేగొండి హరిరామ జోగయ్య.. సీనియర్ నేత. ఆయన మొన్నటి వరకూ రాజకీయంగా విశ్రాంతి తీసుకున్నట్లుగానే కనిపించారు.
చేగొండి హరిరామ జోగయ్య.. సీనియర్ నేత. ఆయన మొన్నటి వరకూ రాజకీయంగా విశ్రాంతి తీసుకున్నట్లుగానే కనిపించారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా హరిరామ జోగయ్య పెద్దగా పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన పెద్దగా బయటకు రాలేదు. ఏపీ పాలిటిక్స్ పై ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించేశారనుకున్నారంతా. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పోరాటాన్ని వదిలేసిన తర్వాత కాపు సంక్షేమ సేనను ఏర్పాటు చేశారు. కాపు రిజర్వేషన్లపై తాను పోరాడతానని చెప్పారు.
జనసేనకు దగ్గరగా...
అయితే గత కొంతకాలంగా ఆయన జనసేనకు దగ్గరవుతున్నట్లే కనిపిస్తుంది. కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చేగొండి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ ఫోన్ కాల్ తో విరమించారు. ఆరోగ్యం సహకరించదని, దీక్ష విరమించాలని పవన్ చెప్పిన వెంటనే జోగయ్య నిమ్మరసం తాగేశారు. అంతటితో ఆగలేదు. ఇతర పార్టీల్లోని కాపు నేతలను లక్ష్యంగా చేసుకుని చేగొండి హరిరామ జోగయ్య లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి గుడివాడ అమరనాధ్ కు ఆయన వరస లేఖలు రాస్తూ పవన్ కు తాము వెన్నుదన్నుగా ఉన్నామని చెబుతున్నారు.
హైకోర్టులో పిటీషన్ వేసి...
అమరనాథ్ కూడా చేగొండి హరిరామ జోగయ్యకు రివర్స్ లేఖలు రాస్తూ ఆయనను ఇబ్బంది పెడుతున్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన చంద్రబాబుతో పవన్ కల్యాణ్ తో పొత్తును మీరు సమర్థిస్తారా? అంటూ జోగయ్యకు అమరనాధ్ లేఖ రాశారు. దీంతో పాటు చేగొండి హరిరామ జోగయ్య కాపు రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ఐదు శాతం కాపులకు ఇవ్వాలంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని అఫడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
కొడుకు కోసమేనా?
వచ్చే ఎన్నికల్లో చేగొండి హరిరామ జోగయ్యకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదు. ఆయన వయసు కూడా అందుకు సహకరించదు. పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన హరిరామ జోగయ్యకు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేటంత ఓపిక లేదు. ఆసక్తి కూడా లేదు. అయితే తన కొడుకును ఆయన రంగంలోకి దించాలన్న ప్రయత్నంలోనే ఉన్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున తన కుమారుడిని పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతోనే హరి రామజోగయ్య యాక్టివ్ అయినట్లు చెబుతున్నారు. పెద్దాయన కాపులకే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో పలుకుబడి ఉన్న నేతగా గుర్తింపు ఉండటంతో జనసేన టిక్కెట్ ఇవ్వక తప్పదంటున్నారు. అందుకే జోగయ్య హడావిడి అంటున్నారు జిల్లా వాసులు.