ఇద్దరికీ పదవులు.. జగన్ నిర్ణయం
సినీ నటుడు ఆలీ, రచయిత పోసాని కృష్ణమురళికి ముఖ్యమంత్రి జగన్ కీలక పదవి ఇవ్వనున్నారు
సినీ నటుడు ఆలీకి ముఖ్యమంత్రి జగన్ కీలక పదవి ఇవ్వనున్నారు. నిన్న జరిగిన టాలీవుడ్ పెద్దల సమావేశం ముగిసిన తర్వాత జగన్ ఆలీతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. వారం తర్వాత వచ్చి తనను కలవాల్సిందిగా జగన్ ఆలీతో చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆలీకి పదవి ఇచ్చేందుకే జగన్ తనను కలవాలని సూచించినట్లు చెబుతున్నారు. నిజానికి నిన్న జరిగిన సమావేశానికి ఆలీకి సంబంధం లేదు.
ఇద్దరితో విడివిడిగా....
చిత్ర పరిశ్రమతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ ఆలీతో చర్చించే విషయాలు ఏవీ ఉండవు. పోసాని కృష్ణమురళి కూడా రచయిత మాత్రమే. ఆయనకు టాలీవుడ్ సమస్యలకు పెద్దగా సంబంధం లేదు. కానీ ఆలీ, పోసాని కృష్ణమురళికి జగన్ కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం వెళ్లడంతోనే వారు నిన్న జరిగిన టాలీవుడ్ మీటింగ్ కు హాజరయ్యారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరితో విడివిడిగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఆలీని మాత్రం వారం రోజుల తర్వాత తనను కలవాలని సూచించగా, పోసాని కృష్ణమురళితో కూడా ప్రత్యేకంగా జగన్ పది నిమిషాలు మట్లాడినట్లు తెలిసింది.
రాజ్యసభకు పంపాలని ఉన్నా....
అయితే ఆలీ గత ఎన్నికల్లోనే గుంటూరు టిక్కెట్ ను ఆశించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో ఆలీకి రాజ్యసభ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ సినిమా వాళ్లను నమ్మడానికి లేదు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు తో జగన్ ఇబ్బంది పడుతున్నారు. రాజ్యసభకు నమ్మకమైన వారినే ఎంపిక చేసుకుంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, పార్టీ కోసం పాటు పడే వారికే అవకాశమిస్తారు. మరి ఆలీ విషయంలో మాత్రం రాజ్యసభకు ఎంపిక చేస్తారని చెబుతున్నా అది కష్టమేనంటున్నారు.
పోసానికి చిత్ర పరిశ్రమకు....
ఆలీ, పోసాని కృష్ణమురళికి పదవుల విషయంలో జగన్ తీవ్రంగానే ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. పోసాని కృష్ణమురళికి సినీ సంబంధమైన పదవిని కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పోసాని తొలి నుంచి జగన్ కు అండగా ఉంటున్నారు. ఆయన కు జగన్ ఖచ్చితంగా పదవి ఇస్తారంటున్నారు. ఆలీ విషయంలో మాత్రం రాజ్యసభ కంటే రాష‌్ట్ర స్థాయి పదవి ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.