ఈసారికి ఇంతేనట
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మంత్రివర్గ విస్తరణ వేస్ట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు జరుగుతుంటే పొరుగున ఉన్న తెలంగాణలో మాత్రం ఆ ఊసే లేదు. ఇక తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు ఛాన్స్ లేదంటున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విస్తరణ వేస్ట్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ ఆశలు పెట్టుకున్న వారిపై నీళ్లు చల్లినట్లయింది. ఇదే కేబినెట్ తో ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏడాదిన్నర.....
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో విస్తరణ చేపడితే అసంతృప్తులు మరింత పెరిగే అవకాశముంది. ఈ సంగతి కేసీఆర్ కు తెలియంది కాదు. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం సరికాదని ఆయన భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ అనుకున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించి, పాత వారికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని భావించారు.
తాజా పరిణామాలు...
కానీ తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన ఆలోచనలో మార్పు తెచ్చాయంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేపడితే కొత్త వారికి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. రాజ్యసభ నుంచి రాజీనామా చేయించి మరీ బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీగా చేశారు. ఈటల రాజేందర్ స్థానాన్ని ఆయనతో భర్తీ చేయాలనుకున్నారు. కానీ లెక్కలన్నీ వరసగా మారుతున్నాయి. ఆయనకు వేరే పదవి ఇచ్చి విస్తరణను వాయిదా వేయాలన్నది కేసీఆర్ ఆలోచన.
గవర్నర్ తో గ్యాప్...
కొత్తవారిని తెచ్చి ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. మరోవైపు గవర్నర్ తో గ్యాప్ ఏర్పడింది. విస్తరణ జరిగితే కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లాల్సి ఉంటుంది. గవర్నర్ ను ఫేస్ చేయడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనేది దాదాపుగా ఖాయమయినట్లేనని చెబుతున్నారు. ఈ కేబినెట్ తోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లనున్నారు.