జయరాం హత్య.. అనేక ప్రశ్నలు..!

రెండు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. అమెరికా పౌరసత్వం.. దేశ విదేశాల్లో వ్యాపారాలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలమైన పరిచయాలు.. పారిశ్రామికవేత్తగా తనదైన ముద్ర వేసిన చిగురుపాటి [more]

Update: 2019-02-02 10:31 GMT

రెండు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. అమెరికా పౌరసత్వం.. దేశ విదేశాల్లో వ్యాపారాలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బలమైన పరిచయాలు.. పారిశ్రామికవేత్తగా తనదైన ముద్ర వేసిన చిగురుపాటి జయరాం హత్య కృష్ణా జిల్లా పోలీసులకు సవాల్ గా మారింది. జయరాం అమెరికన్ సిటిజన్ కావడంతో కేసు దర్యాప్తుపై అమెరికన్ ఎంబసీ అధికారులు ఆరా తీస్తున్నారు. జయరాంను హత్య చేసిన వ్యక్తులు హైదరాబాద్ కు చెందిన వారేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అనుమానాలు అనేకమందిపై ఉన్నప్పటికి ప్రాథమికంగా జయరాం మేనకోడలు శిఖా చౌదరినే ఈ కేసులో ప్రధాన అనుమానితురాలని పోలీసులు భావిస్తున్నారు. జయరాం హత్యకు ఆర్ధిక లావాదేవీలు,వ్యక్తిగత కారణాలు కారణం కావచ్చని అంచనాకు వచ్చారు. విషం ఇంజక్షన్ ద్వారా జయరాం మరణం సంభవించిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

ఆరు లక్షలు తెప్పించుకుని…

జయరాం జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి జనవరి 30వ తేది మధ్యాహ్నం రెండున్నరకు వెళ్లాడన్న విషయాన్ని వాచ్ మెన్ శ్రీనివాస్ నిర్ధారించాడు. అంతకు గంట ముందే జయరాం తన డ్రైవర్, ప్రైవేటు సెక్యూరిటీ గార్డుతో కలిసి ఇంటికి వచ్చాడని, రేపు ఉదయం విజయవాడ వెళ్లాలని వారికి చెప్పి ఇంట్లోకి వెళ్లాడని వాచ్ మెన్ చెప్పాడు. అయితే, సరిగ్గా గంటకు జయరాం ఇంట్లోంచి హడావుడిగా బయటకు వచ్చి కారు తీసుకుని బయలు దేరారని, ఆయన ఒంటరిగా అలా వెళ్లడం అరుదని శ్రీనివాస్ తెలిపాడు. అలా వెళ్లిన జయరాం ఎక్కడికి వెళ్లారు.. ఎవరెవరిని కలిశారన్న విషయాలను గుర్తించే పనిలో పడ్డారు నందిగామ పోలీసులు. ఇంట్లోంచి బయటకు వచ్చిన జయరాం దసపల్లా హోటల్ కు వెళ్లారని, అక్కడ ఒక మహిళా యాంకర్ పేరిట ఉన్న గదిలో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. 30వ తేది సాయంత్రం జయరాం తన సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఫోన్ చేసి డబ్బు తెప్పించుకున్నారని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి ఆరులక్షల రూపాయలు తీసుకుని వచ్చి జయరాంకు అప్పగించారని తెలుస్తోంది. హఠాత్తుగా జయరాం ఆరు లక్షల రూపాయలను ఎందుకు తెప్పించుకున్నారు? ఆ డబ్బు ఎవరికి ఇచ్చారు? అన్న విషయాలు తెలుసుకోవడం కోసం పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో దసపల్లా హోటల్ సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఆయనతో ఎవరెవరున్నారు..?

జయరాం మృతదేహం లభ్యమైంది 31వ తేదీ అర్ధరాత్రి నందిగామ సమీపంలో. అంటే 30వ తేదీ సాయంత్రం నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు జయరాం ఎవరితో ఉన్నాడు? జయరాం మృతదేహం లభించిన కారును నడిపిన తెల్లచోక్కా వ్యక్తి ఎవరు? కారు వెనుక సీట్లో జయరాంతో కూర్చున్న వ్యక్తి ఏవరు? వెనుక సీట్లో శిఖా చౌదరి కూర్చుందా? లేక మరెవరైనా ఉన్నారా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జయరాం తలపై బీరు సీసాతో కొట్టిన దెబ్బ కన్పిస్తున్నప్పటికి, ఆ గాయంతో మరణం సంభవించే అవకాశం లేదని, ఆయన శరీరం నీలం రంగులోనికి మారిన నేపథ్యంలో విష ప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బలమైన కారణంతోనే హత్య…

జయరాంతో విభేదాలున్న శిఖాను ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆర్థిక వ్యవహరాలకు సంబంధించి అకౌంటెంట్ వేణును కూడా పోలీసులు ప్రశ్నించారు. శిఖా నోరు విప్పితే చాలా విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బయటకు వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే జయరాం ఒంటరిగా వెళ్లాలంటే బాగా తెలిసిన వాళ్ల వద్దకే వెళ్లి ఉండవచ్చని, అలా ఆయనను నమ్మించి బయటకు తీసుకుని వచ్చి దాదాపు 30 గంటలకు పైగా తమతో ఉంచుకుని ఆ తర్వాత హత్య చేశారంటే బలమైన కారణం ఉండే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కొద్ది గంటల్లో ఈ కేసులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని కృష్ణా జిల్లా పోలీసులు అంటున్నారు.

Tags:    

Similar News