హైదరాబాద్ వణికింది
ఉదయం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం మరోసారి వణికిపోయింది. భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.
ఉదయం కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం మరోసారి వణికిపోయింది. భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. నాలాల్లో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. కుండపోత వర్షానికి నగర వాసులు భయపడిపోయారు. తమ ఇంటి ముందు వాహనాలు కూడా నాలాలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కావడంతో ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్‌కు బయలు దేరిన వాళ్లు సయితం వర్షబీభత్సానికి హడలి పోయి ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంపై నగర వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏడు సెంటీమీటర్లు...
హిమాయత్ నగర్, శేరిలింగపల్లిలో ఏడు సెంటీమీటర్ల వర్షం నమోదయింది. అనేక కార్లు నీటిలో మునిగిపోయాయి. ఇక ద్విచక్రవాహనాలయితే చెప్పనక్కరలేదు. నాలాల్లో ఎక్కడ చూసినా ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. తాము కష్టపడి కొనుగోలు చేసిన వాహనాలు వరద నీటికి కొట్టుకుపోతుండటంతో చూసి కూడా ఏమీ చేయలేక రోదించడం మినహా మరేమీ చేయలేకపోయారు. కళ్ల ముందే వాహనాలు నీటిలో కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు గంట పాటు సృష్టించిన వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
నాలాల్లో వాహనాలు...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నాలాలను సక్రమంగా అభివృద్ధి చేయకపోవడం వల్లనే చిన్నపాటి వర్షం కురిసినా నగరం సముద్రంలా మారిపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలాలో పడి కళాసిగూడలో ఒక చిన్నారి మృతి చెందిన ఘటన కలచి వేస్తుంది. రాంనగర్ ప్రాంతంలో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో రహదారులపైనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిద్రమత్తు వీడి తగిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.