సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ .. ఈసారి 10 రోజులు అక్కడే !
బీజేపీపై యుద్ధం తప్పదని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఏకంగా 10 రోజులపాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. తెలంగాణ ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనకుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై యుద్ధం తప్పదని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు వాహనంతో దూసుకెళ్లడంతో పలువురు రైతులు, జర్నలిస్టు మరణించగా, మరికొందరు రైతులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా లఖింపూర్ ఖేరీ బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.
పంటినొప్పితో బాధపడుతున్న కేసీఆర్.. ఏప్రిల్ 3న ఢిల్లీ వెళ్లి చెకప్ చేయించుకున్నారు. ఆ తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో 11న తెలంగాణ భవన్ ఎదుట టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో పలువురు ఆర్థికవేత్తలు, రైతుల సంఘాల ప్రతినిధులను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం మహారాష్ట్ర వెళ్లి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కి సంబంధించి పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉంది.