ప్రధాని జెండా ఎగరవేయడం ఇదే చివరిసారి.. మోదీపై ఖార్గే సంచలన వ్యాఖ్యలు
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ..
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ..దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తాను ఇప్పటివరకు వరుసగా 10వ సారి జెండా ఎగురవేయడం అని చెప్పుకొచ్చారు. మరోసారి కూడా తాను ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు, అందుకు కారణం తాము చేస్తున్న అభివృద్ధేనని, ప్రజలు మరోసారి తమను ఆశీర్వదిస్తారని చెప్పారు. అయితే వచ్చే సంవత్సరం కూడా ఎర్రకోట నుంచి జెండా ఎగురవేస్తానన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. వచ్చేసారి మోదీ జెండాను తన ఇంట్లోనే ఎగురవేస్తారని, మోదీ జెండా ఎగురవేయడం ఇదే చివరి సారి అంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.
మల్లిఖార్జున్ ఖార్గే న్యూఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే సంవత్సరం మోదీ ఎర్రకోటపై జెండాను ఎగురవేయరని, ఆయన ఇంట్లో మాత్రమే అంటే ఒక జెండా మాత్రమే ఎగురవేస్తారంటూ చెప్పారు. గెలిచిన వ్యక్తి ప్రతిసారి అధికారంలోకి వస్తామని చెప్పడం అలవాటేనని, గెలుపు ఓటములు అనేవి ప్రజల చేతుల్లో ఉంటుందని, 2024లో కూడా తానే ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రతిపక్షాలపై ఆరోపణలు చేసే మోదీ.. దేశాన్ని ఎలా నిర్మిస్తాడని ప్రశ్నించారు. అయితే ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మల్లిఖార్జున్ ఖార్గే పాల్గొనలేదు. హాజరు కాకపోవడంపై ఆయన సమాధానం ఇచ్చారు. తనకు కంటి సమస్యలున్నాయని, అందుకే వెళ్లలేదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం.. తాను 9.20 గంటలకు తన నివాసంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సి వచ్చిందన్నారు.
అదే టైమ్‌లో కాంగ్రెస్ కార్యాలయం వద్ద కూడా జెండా ఆవిష్కరించినట్లు చెప్పారు. అందుకే ఎర్రకోటకు వెళ్లలేకపోయానన్నారు. ప్రధాని మోదీ వెళ్లే ముందు మరెవరినీ లోపలికి అనుమతించరు. భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది.. సమయానికి అక్కడికి చేరుకోలేం అనుకున్నా.. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించి వెళ్లలేదని ఖార్గే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓవరు ఓడాలో..ఎవరు గెలవాలో అనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్న తీరును ఖార్గే తప్పుబట్టారు. సభలో మాట్లాడేందుకు కూడా వీలు కల్పించకుండా మైక్‌లు సైతం ఆఫ్ చేశారని ఖార్గే మండిపడ్డారు.
ఇలా మల్లిఖార్జున్ ఖార్గే మోదీపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇలాంటి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఖార్గే పై మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీనే బాధ్యతలు చేపట్టి తీరుతారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.