Rahul Gandhi : కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోంది

తెలంగాణ ప్రజల ఆస్తిని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు

Update: 2023-10-31 13:21 GMT

తెలంగాణ ప్రజల ఆస్తిని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కొల్లాపూర్ లో జరిగిన పాలమూరు ప్రజా భేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన సోదరి ప్రియాంక రావాల్సిన సభలో ఆమె రాలేకపోయినందున ఆమె స్థానంలో తాను వచ్చానని తెలిపారు. సెంట్రల్ కమిటీ మీటింగ్ ఢిల్లీలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజానీకం ముఖ్యమని తాను కొల్లాపూర్ కు వచ్చానని చెప్పారు. సోదరి ప్రియాంక ఇచ్చిన కమిట్‌మెంట్ తోనే తాను ిక్కడకు వచ్చానని తెలిపారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య రాబోయే ఎన్నికలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారి కుటుంబం, మరో వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందన్నది ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అత్యంత పెద్ద మోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతిక పాల్పడటమేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి లక్ష కోట్ల రూపాయలు లూటీ చేశారన్నారు.

కుంగిపోయిన కాళేశ్వరం...
కాళేశ్వరం బ్యారేజీ కుంగిపోతుందని అన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలిసిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీద, బడుగు వర్గాలకు భూమిని ఇచ్చిందన్నారు. ఆ రోజు ఇచ్చిన భూమిని మీ ముఖ్యమంత్రి లాక్కుంటున్నారని అన్నారు. కంప్యూటరైజేషన్ పేరుతో ధరణిని తెచ్చి భూములను దోపిడీ చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ధరణి వల్ల కల్వకుంట కుటుంబానికి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే లాభం జరిగిందన్నారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యమయి పోయాయని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆస్తి పూర్తిగా కల్వకుంట కుటుంబానికే పోతుందని అన్నారు.
ముఖ్యమైన శాఖలన్నీ....
అన్ని ముఖ్యమైన శాఖలను వారి కుటుంబాల వద్దనే పెట్టుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ కు అండగా నిలబడండని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అసలు ప్రయోజనాన్ని ప్రజలకు చేరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. రైతులకు భరోసా కింద పదిహేడు వేల రూపాయలు ప్రతి ఎకరాకు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు. ప్రతి నెల 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పారు.
ఆ మూడూ ఒక్కటే...
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు యుద్ధం జరుగుతోందన్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కలసి పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఏ బిల్లుకైనా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ముఖ్యమంత్రిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని, ఈడీ కేసులు లేవన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగలని ఆయన అన్నారు. ఎక్కడ బీజేపీకి మద్దతు అవసరమైతే అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందని రాహుల్ అన్నారు. రాజస్థాన్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లలో బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఎంఐఎం పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తుందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడించి 2024లో ఢిల్లీలో అధికారంలోకి వస్తామని రాహుల్ అన్నారు. ఇచ్చిన హామీలను మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం చేస్తామని తెలిపారు. ఎంతయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత దోచుకున్నారో అంత సొమ్మును ప్రజల జేబుల్లోకి ఇస్తామని రాహుల్ అన్నారు. 


Tags:    

Similar News