మైలేజీ కంటే డ్యామేజే ఎక్కువైందా...?

దివంగత ఎన్టీరామారావు శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదలైన నాణెం ఎన్టీయార్‌ ప్రభను మసకబారేలా చేసింది. భార్య హోదాలో లక్ష్యీపార్వతి ఉండగా, ఆమెను ఆహ్వానించకపోవడం మొదటి వివాదం కాగా, జనాల్లో తాతకు తగ్గ మనవడిగా క్రేజ్‌ ఉన్న జూనియర్‌ ఎన్టీయార్‌ ఆ కార్యక్రమానికి వెళ్లకపోవడం మరో వివాదమైంది.

Update: 2023-08-29 07:55 GMT

మహానటుడు స్మారక నాణెం విడుదలకు వివాదాల మరక 

దివంగత ఎన్టీరామారావు శత జయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదలైన నాణెం ఎన్టీయార్‌ ప్రభను మసకబారేలా చేసింది. భార్య హోదాలో లక్ష్యీపార్వతి ఉండగా, ఆమెను ఆహ్వానించకపోవడం మొదటి వివాదం కాగా, జనాల్లో తాతకు తగ్గ మనవడిగా క్రేజ్‌ ఉన్న జూనియర్‌ ఎన్టీయార్‌ ఆ కార్యక్రమానికి వెళ్లకపోవడం మరో వివాదమైంది. ఎన్టీయార్‌ శత జయంత్యుత్సవాల కంటే, నాణెం విడుదల కంటే ఈ వివాదాలే మీడియా, జనం దృష్టిని ఆకర్షించాయి. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి, ఎన్టీయార్‌ కుటుంబానికి రావాల్సిన మైలేజీ కంటే జరగాల్సిన డ్యామేజే ఎక్కువ జరిగింది.

విద్యా దీవెన నిధుల విడుదల సమయంలో జగన్‌ ఎన్టీయార్‌ కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలు అగ్ని ఆజ్యం పోశాయి. ఎన్టీయార్‌ కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా పురంధేశ్వరిపై లక్ష్మీపార్వతి మీడియాముఖంగా చేసిన విమర్శలు సోషల్‌ మీడియాలో బలంగా చొచ్చుకుపోయాయి. ఎన్టీయార్‌ భార్య హోదాలో తనను ఆహ్వానించకపోవడంపై రాష్ట్రపతికి, ప్రధానికి ఆమె లేఖ రాశారు. ఇది పూర్తిగా ప్రయివేటు కార్యక్రమమని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యే ఓ నాణెం విడుదలను ప్రయివేటు కార్యక్రమం అని చెప్పినా, దానిని హడావుడిగా అధికారిక కార్యమ్రంలానే నిర్వహించారు. మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం లభించడం, టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్‌ చేయడంతో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌, ఎన్టీయార్‌ భార్య లక్ష్మీపార్వతి మాటలకు మరింత ప్రాచుర్యం లభించింది..

ఢిల్లీలో వైకాపా రెబెల్‌ ఎంపీ రఘరామ కృష్ణంరాజు ఆర్భాటం, తెలుగుదేశం మాజీ నాయకులు సీఎం రమేష్‌, సుజనా చౌదరి ఎన్టీయార్‌ కుటుంబ సభ్యులను కలవడం, చంద్రబాబు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కావడం తెలుగుదేశం దృష్టిలో సానుకూల పరిణామాలు కావచ్చు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, భాజపా పొత్తు కుదుర్చుకుంటాయని తద్వారా చంద్రబాబుకి మేలు జరుగుతుందని సైకిల్‌ పార్టీ వర్గాలు సంబరపడొచ్చు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. సోమవారం జరిగిన పరిణామాలన్నీ వైకాపాకు తెదేపాకు వ్యతిరేకంగా బలమైన ఆయుధాన్ని అందించాయి.

భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే పురంధేశ్వరి వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అవన్నీ రోజూ చంద్రబాబు అండ్‌ టీమ్‌ చేసే విమర్శలే. దీనిపై అధికార పక్షం నేతలు ‘వదినగారు మరిదిగారి స్క్రిప్ట్‌ చదువుతున్నార’ని ఆరోపించారు. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీని ఏ మాత్రం విమర్శించకపోవడం కూడా ఆమె తండ్రిగారి పార్టీకి అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలను పంపించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని రుణాల ఊబిలో నెట్టేస్తోందని ఆమె ఆరోపించారు. కానీ పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం రాష్ట్రం అప్పు నాలుగున్నర లక్షల కోట్లేనని చెప్పింది. దీంతో ఆమె మౌనం వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం.. చంద్రబాబు, పురంధేశ్వరి కుటుంబాలు మాత్రమే రాష్ట్రపతి భవన్‌కి వెళ్లడం.. ప్రతిపక్షాల విమర్శలను నిజం చేసినట్లయింది. లక్ష్మీపార్వతి విమర్శలకు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, ఎన్టీయార్‌ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంతవరకూ సరైన సమాధానం లేదు. ఓ మహానటుడు, నాయకుడి శత జయంతి నాణెం విడుదల ఇలా వివాదాలకు గురి కావడం ఆయన అభిమానులను వేదనకు గురి చేస్తోంది.

Tags:    

Similar News